చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటుకు నిర్ణయం
100 ఎకరాల స్థలం కేటాయింపు
చందన్వెల్లి ఐపీకి మరో 1200 ఎకరాలు
షాబాద్ మండలంలోని సీతారాంపూర్‌లోని దేవాదాయ భూములు
స్వచ్ఛందంగా అంగీకరించిన గ్రామస్తులు, రైతులు
ఎకరాకు రూ.10 లక్షల పరిహారం, 120 గజాల స్థలం
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం
పారిశ్రామికాభివృద్ధికి సర్కార్ ప్రాధాన్యత
పరిశ్రమల ఏర్పాటుకు సకల సౌకర్యాలు
పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన సకల సౌకర్యాలను సమకూర్చుతున్నది. పరిశ్రమల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అనువైన ప్రాంతం కావడంతో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో పరిశ్రమలను నెలకొల్పగా ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నది. కొత్తగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్‌ను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సరైన రవాణా సౌకర్యంతోపాటు విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమను నెలకొల్పనున్నారు. దీంతో పరిశ్రమ ఏర్పాటుకు 100 ఎకరాల స్థలంతో పాటు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. అంతేకాకుండా చందన్వెల్లి ఇండ్రస్ట్రియల్ పార్కుకు సమీపంగా ఉన్న షాబాద్ మండలం సీతారాంపూర్‌లోని దేవాదాయ భూములు 1200 ఎకరాలనూ ఇచ్చేందుకు సర్కారు నిర్ణయించింది. సంబంధిత దేవాదాయ శాఖకు, కొన్నాళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు ఎకరాకు రూ.10 లక్షల పరిహారం, 120 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు టీఎస్-ఐఐసీ సానుకూలంగా స్పందించింది. దీంతో గ్రామస్తులతోపాటు రైతులూ స్వచ్ఛందంగా అంగీకరించడంతో భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 26, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇండస్ట్రియల్ పార్కులుండడంతోపాటు పరిశ్రమల నిర్వహణకు కావాల్సిన సకల వసతులు కల్పిస్తుండటంతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. ఎన్నో ఇండస్ట్రియల్ పార్కులు, హార్డ్‌వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మెగా ఉత్పత్తి పరిశ్రమలు జిల్లాలో నెలకొల్పారు. అంతేకాకుండా దేశంలోనే ప్రముఖమైన పరిశ్రమలు అమేజాన్, వెల్స్పన్, క్రోనస్, టాటా, విజయ్‌నేహా, పోకర్ణ ఇంజనీర్ స్టోన్ పరిశ్రమ, నాట్కో ఫార్మా, రెనెసిస్, కాస్పర్, విప్రో, ఎంఎస్ఎన్లాంటి ప్రముఖ పరిశ్రమల ప్లాంట్లు జిల్లాకు తరలివచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన టీఎస్-ఐపాస్ ద్వారా పారిశ్రామికరంగంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఓ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలంటే ఆరు నెలల వరకు సమయం పట్టేది, అంతేకాకుండా అనుమతి వస్తుందా, రాదనేది కూడా గ్యారంటీ ఉండేది కాదు కానీ టీఎస్-ఐపాస్ విధానంతో ఎంత భారీ పరిశ్రమ ఏర్పాటుకైనా కేవలం పదిహేను రోజుల్లోగా అనుమతులు లభిస్తుండడంతో అధిక మొత్తంలో పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. అంతేకాకుండా పరిశ్రమలకు నాణ్యమైన 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో కూడా పరిశ్రమలను నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.
జిల్లాకు ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమ…
సరైన రవాణా సౌకర్యంతోపాటు విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో ఉన్న చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ దేశంలోనే మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ముందుకు రావడంతో అందుకు అనుగుణంగా సంబంధిత పరిశ్రమకు స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ప్రస్తుతం సేకరిస్తున్న భూముల్లో 100 ఎకరాలను ఎలక్ట్రిక్ కార్ల తయారీ పరిశ్రమకు కేటాయించనున్నారు. అయితే ప్రస్తుతం 600 ఎకరాల్లో నెలకొని ఉన్న చందన్వెల్లి ఇండస్ట్ట్రియల్ పార్కులో అమేజాన్, వెల్స్పన్, కుందన్, కటేరా వంటి ప్రముఖ పరిశ్రమలున్నాయి.
చందన్వెల్లి ఐపీకి మరో 1200 ఎకరాలు…
షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్ట్రియల్ పార్కులో పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తుండడంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కుకు సమీపంలో ఉన్న 1200 ఎకరాల భూములను సేకరించే ప్రక్రియ వేగంగా సాగుతుంది. షాబాద్ మండలంలోని సీతారాంపూర్‌లోని దేవాదాయ భూములను ఇండస్ట్రియల్ పార్కుకు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సంబంధిత దేవాదాయ భూములను సీతారాంపూర్ గ్రామస్తులు గత కొన్నేళ్లుగా సాగు చేస్తూ వస్తున్నారు. అయితే భూసేకరణకు సంబంధించి ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తికాగా, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి జరుగుతుందనే సదుద్దేశంతో గ్రామస్తులతోపాటు దేవాదాయ శాఖ భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సంబంధిత భూములకు సంబంధించి టీఎస్-ఐఐసీ ఆధ్వర్యంలో వేగంగా సేకరణ ప్రక్రియ జరుగుతున్నది. ఇప్పటికే 600 ఎకరాల్లో ఉన్న చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కు విస్తీర్ణం త్వరలో 1800 ఎకరాలకు చేరనుంది.
రైతులకు 120 గజాల స్థలం…
చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కుకు భూములిచ్చిన రైతులతోపాటు దేవాదాయ భూములు కావడంతో సంబంధిత శాఖకు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందుకుగాను రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి చేరిన సంబంధిత ఫైల్‌కు త్వరలోనే ఆమోదం లభించనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది.
అదేవిధంగా గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు ఒక్కొ కుటుంబానికి 120 గజాల చొప్పున స్థలాన్ని కూడా కేటాయించేందుకు టీఎస్-ఐఐసీ సానుకూలంగా ఉంది. అయితే భూములు కోల్పోయే రైతులు ఎంతమంది ఉన్నారో సంబంధిత రైతులందరికి హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్‌ను అభివృద్ధి చేసి ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున ఇవ్వనున్నారు. మరోవైపు చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో సీతారాంపూర్ గ్రామంలోని కుటుంబంలోని ఒక్కొక్కరికి ఉపాధి కూడా చూపించేందుకు జిల్లా మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి చర్యలు చేపట్టారు.