అన్నదాతల శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. పెట్టుబడి సాయం అందజేయడంతో పాటు రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ కొండంత అండగా నిలుస్తున్నది. అన్నదాతల కష్టాలను గుర్తెరిగిన సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే మొదటి దఫా రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో భాగంగా రూ.50 వేల లోపు రుణాల మాఫీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. మాఫీ డబ్బులు రాష్ట్ర ట్రెజరీ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దశల వారీగా ఈ నెలాఖరులోగా రెండో దఫా రుణమాఫీని పూర్తి చేయనున్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో రూ.50 వేలలోపు పంట రుణాలు రూ.82.49 కోట్లు ఉండగా, 24,013 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. మూడో దఫాలో రూ.75 వేల లోపు రుణాలు, చివరి దఫాలో రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసి అన్నదాత మోములో ఆనందాన్ని చూడాలన్నదే సర్కారు సదుద్దేశం. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు సుమారు రూ.300 కోట్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. పంట రుణాలు మాఫీ అవుతుండడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 16, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. గత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. ఇందులో భాగంగా మొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. నాలుగేండ్లలో చేయాల్సిన రుణమాఫీని మూడేళ్లలో పూర్తి చేసి రైతు ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్నది. రెండో విడుత రుణమాఫీలో భాగంగా రూ.లక్ష లోపు పంట రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేసేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే మొదటి దఫాగా రూ.25 వేలలోపు రుణాలు మాఫీ చేయగా, రెండో దఫా రూ.50 వేలలోపు రుణాల మాఫీ ప్రక్రియ సోమవారం నుంచి షురూ అయ్యింది. రాష్ట్ర ట్రెజరీ నుంచి నేరుగా బ్యాంకులకు రుణమాఫీ సొమ్ము జమ అయ్యింది. ఈ నెలాఖరు వరకు రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. తొలిరోజు రూ.30 వేల లోపు గల పంట రుణాలకు సంబంధించి నగదును బ్యాంకుల్లో జమచేశారు. ఇలా దశల వారీగా ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు రుణాల మొత్తాన్ని జమ చేయనున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులను తొలుత అధికారం చేపట్టిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం, మరోసారి రుణాలు మాఫీ చేస్తున్నందుకు రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు, రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తుండడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.50 వేలలోపు రుణాల మాఫీతో జిల్లాలోని 24,013 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. రూ.50 వేలలోపు పంట రుణాలు జిల్లాలో రూ.82.49 కోట్లు ఉండగా, సంబంధిత రుణాలను ఈ నెలాఖరులోగా మాఫీ చేయనున్నారు. ఇప్పటికే మాఫీ అయిన రూ.25 వేలలోపు పంట రుణాలతో 10,940 మంది రైతులకు లబ్ధి చేకూరగా, రూ.16.74 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. రూ.లక్ష లోపు పంట రుణాలు పొందిన రైతులు 1.47 లక్షల మంది ఉండగా, రూ.25 వేలలోపు రుణమాఫీ పూర్తికాగా, రూ.50 వేలలోపు రుణాలు ఈ నెలాఖరులోగా మాఫీ కానున్నాయి. మూడో దఫాలో రూ.75 వేలలోపు రుణాలు, తదనంతరం లక్ష లోపు రుణాలను చివరి దఫాలో మాఫీ చేయనున్నారు. జిల్లాలో రూ.లక్షలోపు రుణాలు సుమారుగా రూ.300 కోట్లు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. తొలి విడుత రుణమాఫీ ప్రక్రియతో జిల్లాలోని 1.50 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. జిల్లాలోని సహకార బ్యాంకు బ్రాంచుల్లో రూ.50 వేలలోపు రుణాలు పొందిన రైతులు 11,313 మంది ఉండగా, రూ.40.56 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు రూ.202 కోట్లు ఉండగా, 44,487 మంది రైతులు ఉన్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లాలో 18,173 మంది రైతులకు రూ.లక్షలోపు పంట రుణాలు రూ.86.91 కోట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి రూ.7.34 కోట్ల రుణాలు మాఫీకాగా, 5094 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. రంగారెడ్డి జిల్లాలో రూ.25 వేలలోపు రుణాలు పొందిన రైతులు 1,981 మంది ఉండగా రూ.3.59 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రూ.75 వేలలోపు రుణాలు పొందిన రైతులు 7,371 మంది ఉండగా రూ.47 కోట్లు పంట రుణాలు పొందారు. రూ.75 వేల నుంచి రూ.లక్షలోపు పంట రుణాలు పొందిన రైతులు 10,490 మంది ఉండగా రూ.97.50 కోట్ల రుణాలున్నాయి.
రూ.50 వేలలోపు పంట రుణాల మాఫీ ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి నగదును నేరుగా బ్యాంకుల్లోనే జమ చేస్తున్నది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు పంట రుణాలన్నీ మాఫీ అవుతాయి. ఈ రుణ మాఫీతో జిల్లాలోని 24,013 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది.