పల్లె ప్రగతితో చింతగూడ కు మహర్దశపూర్తయిన మౌలిక వసతుల కల్పనఇంటింటికీ మిషన్ భగీరథ నీరువిద్యుత్ సమస్యలకు పరిష్కారం అందుబాటులోకి వైకుంఠధామం, చెత్త డంపింగ్‌యార్డు
షాద్‌నగర్, ఆగస్టు 10: పల్లె ప్రగతితో మారుమూల పల్లెలు సైతం అభివృద్ధి వైపు పయనిస్తున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ బలోపేతం కావడంతో గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో మొక్కల పెంపకానికి ప్రత్యే శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాలకు కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. పాడుబడిన బావులు, గుంతలు పూడ్చి వేత, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేయడం, కలుపు మొక్కలు, చెత్త తొలగించడంతో గ్రామాలు పరిశుభ్రంగా మారాయి. మురుగు కాల్వల పూడిక తీతతో మురుగు సమస్య పరిష్కారమైంది. ప్రజలు సేద తీరేందుకు ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కమ్యూనిటీ భవనాల నిర్మాణం, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, నిరంత విద్యుత్ సరఫరా, పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ వంటి పనులతో పల్లెలు ప్రగతిబాట పట్టాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం ఫరూఖ్‌నగర్ మండలంలోని చింతగూడ గ్రామం. పల్లె ప్రగతితో ఈ గ్రామానికి మహర్దశ పట్టింది. పచ్చని చెట్లు, పరిశుభ్రత వాతావరణంతో ఈ గ్రామ రూపురేఖలు మారాయి.
చింతగూడ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో 1578 మంది ప్రజలు జీవనం సాగిస్తుండగా సుమారు 310 నివాసాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామంలో వ్యవసాయ, పారిశ్రామికరంగంలో ప్రజలు ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత దర్శనమిస్తుంది. ప్రభుత్వం నుంచి నిధులు పుష్కలంగా అందుతుండటంతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో సమస్యలన్నీ తీరాయి. రూ. 80 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా రూ. 13.50 లక్షలను వెచ్చించి విద్యుత్ వ్వవస్థను ఆధునీకరించారు. రూ.2 లక్షలతో పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇందులో 4 వేలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. హరితహారం పథకం ద్వారా 8 వేల మొక్కలు నాటి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మొక్కలు సంరక్షణకు కూలీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి నెలా రూ.30 వేల వరకు చెత్త సేకరణకు ఖర్చు చేస్తున్నారు. గ్రామ అవసరాల కోసం రూ.13 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. రూ.8.5 లక్షలతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. రూ. 20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.8 లక్షలతో అంతర్గత మురుగు కాలువలు నిర్మించారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామానికి రహదారికి ఇరువైపులా మొక్కలను పెంచుతున్నారు. రూ.1.50 లక్షల నిధులతో గ్రామంలో భారీ ఇంకుడు గుంతను ఏర్పాటుచేశారు. పాడుబడిన బావులు, గుంతలను పూడ్చారు. పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే సీసీ రోడ్లు, మురుగు కాలువలను నిర్మించాం. ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందుతున్నది. గ్రామంలో శుభ్రత ఉండడంతో అటు వ్యాధుల వ్యాప్తి తగ్గింది. ప్రభుత్వ నిధులతో దాతల ఆర్థికసాయంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం.