ఉద్యోగాల సాధనలో ఇతర గ్రామాలకు ఆదర్శం ఆ గ్రామ యువత.. ప్రభుత్వ, ప్రైవేటు కొలువేదైనా వీరికి దక్కాల్సిందే. ప్రతి పది ఇండ్లకు ఒకరి చొప్పున ఉద్యోగి ఉన్నాడు. దీంతో కొలువుల పల్లెగా పేరొందింది రంగారెడ్డిజిల్లా మంచాల మండలంలోని జాపాల గ్రామం. ఆర్టీసీ, పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల్లో ఉద్యోగాలు సాధించి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు గ్రామస్తులు. మొదటగా జాపాల-రంగాపూర్ మధ్యలో ఎత్తైన కొండపై ఏర్పాటైన అబ్జర్వేటరీ (నక్షత్రశాల)లో పలువురికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ ఉద్యోగాలతో ప్రారంభమై నేటికి ఆ పరంపర కొనసాగుతున్నది. ఏకంగా 37 మంది ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లుగా పనిచేస్తున్నారు.
-ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 9 : ఉద్యోగం ఆ ఊరి లక్షణంగా కొలువులపై దృష్టి సారిస్తున్నది.. జాపాల గ్రామం. ఈ గ్రామానికి చెందిన యువత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలవైపు దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ గ్రామం ఉద్యోగాల సాధనలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. రంగారెడ్డిజిల్లా, మంచాల మండలంలోని జాపాల గ్రామానికి మొదటి నుంచి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్రను నేటికి ఏదో ఒక్క రంగంలో నిలబెట్టి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ గ్రామం నేడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో కూడా మొదటిస్థానంలో ఉంది. యువకులు ఎంతోమంది ఆర్టీసీ, పోలీసు, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల్లో ఉద్యోగాలు సాధించి తమకంటూ ఓ గుర్తింపు తీసుకువచ్చారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులను ఆదర్శంగా తీసుకుని గ్రామానికి చెందిన యువత తాముకూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న తపనతో ముందుకెళ్లి ఉద్యోగాలు సాధించడంలో సఫలీకృతులవుతున్నారు.
అబ్జర్వేటరీ రాకతో ఉద్యోగాలకు పునాది..
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉన్న ఖగోళశాస్త్ర పరిశోధన సంస్థ జాపాల-రంగాపూర్ మధ్యలో ఎత్తైన కొండపైన అబ్జర్వేటరీ (నక్షత్రశాల)ను ఏర్పాటు చేశారు. ఈ నక్షత్రశాల ఏర్పాటుతో జాపాల గ్రామానికి చెందిన పలువురికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ ఉద్యోగాలతో ప్రారంభమై నేటికి ఆ పరంపర కొనసాగిస్తున్నారు. జాపాల- రంగాపూర్ నక్షత్రశాలలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో భాగంగా జాపాల గ్రామం నుంచే ఐదుగురికి మొదటగా అందులో ఉద్యోగావకాశాలు లభించాయి. అప్పటినుంచి ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మొదలైంది.
100మంది వరకు ఉద్యోగస్తులు..
జాపాల గ్రామంలో ప్రతి పది ఇండ్లకు ఒకరికి చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. కొంతమందికి ఒకేఇంట్లో ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీంతో గ్రామానికి చెందిన సుమారు వందమంది వరకు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. జాపాల గ్రామంలో బీనమోని మల్లేష్ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు ఉన్నాయి. కాగా, ఇటీవల మల్లేష్ ఆర్టీసీ డ్రైవర్గా పదవీ విరమణ చేశారు. అతడి కుమారులు రాజు ఆర్టీసీ డ్రైవర్, శేఖర్, నాగరాజు పోలీసు కానిస్టేబుళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాగే, అనేకమంది ఒకే ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో 37మంది డ్రైవర్, కండక్టర్లు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఒక్క జాపాల గ్రామానికి చెందిన సుమారు 37మంది డ్రైవర్, కండక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిపోలో ఉన్న ఉద్యోగులు అత్యధికంగా జాపాల గ్రామానికి చెందినవారే. ఈ గ్రామానికి చెందిన 22మంది డ్రైవర్లు కాగా, 15మంది కండక్టర్లు ఉన్నారు. ఇటీవల వీరు ఇబ్రహీంపట్నం డిపో నుంచి ఇతర డిపోలకు కూడా బదిలీ అయ్యారు. ఆర్టీసీలో ఎప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ పడినా జాపాల గ్రామానికి చెందినవారే ముందుంటారు.
జాపాల గ్రామం నుంచి 37మంది ఆర్టీసీ డ్రైవర్, కండ్టర్లుగా పనిచేస్తున్నారు.
14మంది పోలీసు కానిస్టేబుల్లుగా, 1 ఏఎస్సైగా పనిచేస్తున్నారు.
10మంది పోలీసుశాఖలో హోంగార్డులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇద్దరు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇద్దరు జాపాల- రంగాపూర్ అబ్జర్వేటరీలో పనిచేస్తున్నారు.
పట్టుదలతో సాధ్యమైంది
కృషి, పట్టుదలతోనే జాపాల గ్రామంలో ఎక్కువ ఉద్యోగాలు సాధించాం. జాపాల గ్రామంలో మొట్టమొదటగా నేను ఆర్టీసీ కండక్టర్గా విధుల్లో చేరాను. నా తర్వాత మా స్నేహితులంతా ఒకరిని చూసి మరొకరు ప్రేరణతో ఆర్టీసీలో చేరారు. కొన్నాళ్ల తరువాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటికీ నా స్నేహితులు ఆర్టీసీలో ఉన్నారు.
మొదట పోలీసుశాఖలో హోంగార్డుగా చేరాను. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావటంతో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్షరాసి ఉద్యోగం సంపాదించాను. నా తర్వాత మా గ్రామానికి చెందిన సుమారు 14మంది పోలీసుశాఖలో కానిస్టేబుళ్లుగా చేరారు. అలాగే, మరో పదిమంది వరకు పోలీసుశాఖలో హోంగార్డులుగా చేరారు. ఇందులో కూడా ఒకరిని మరొకరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగాలు సంపాదించగలిగారు.
స్నేహితులంతా ఉద్యోగులే..
ఆర్టీసీలో ఉద్యోగాలు రావటానికి కేవలం మా స్నేహమే దోహదపడింది. మేమంతా పదిమంది స్నేహితులం ఉండేవాళ్లం. ఒకరికి ఆర్టీసీ ఉద్యోగంరావటంతో మిగతా వారంతా ఆర్టీసీలోనే చేరి ఉద్యోగాలు చేస్తున్నాం. ముఖ్యంగా స్నేహభావం కూడా ఉద్యోగాలు రావటానికి కారణమైంది. తమ స్నేహితుడికి ప్రభుత్వ ఉద్యోగం రావటంతో తాముకూడా ఎలాగైనా ఆర్టీసీలో చేరాలని పట్టుదల ఈ స్థాయికి చేర్చింది. ప్రస్తుతం తామంతా ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్లుగా పనిచేస్తున్నాం.