హరిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ చేపట్టిన హరితహారం సత్ఫలితాలనిస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గతంలో కంటే సుమారు 4 శాతం అటవీ సంపద పెరుగడంతో ప్రకృతి కాంతకు పచ్చకోక కట్టినట్టుగా అడవులు కనువిందు చేస్తున్నాయి. అడవులు పెరిగితేనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, కాలుష్య నియంత్రణతో పాటు మానవ మనుగడ ఉంటుందన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా అటవీ ప్రాంతంలో 62 లక్షల మొక్కలు నాటగా, వికారాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో 6,79,847 మొక్కలు నాటారు. ప్రతి మొక్క సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో ఎప్పటికప్పుడు మరో మొక్కను నాటడంతో అడవుల్లో పచ్చదనం పెరిగింది. ఈసారి ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో ఎక్కువ శాతం ఔషధ మొక్కలను నాటేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు.
రంగారెడ్డి, అక్టోబర్ 7, (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. ఏడేండ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలతో రంగారెడ్డి జిల్లాలో పచ్చదనం భారీగా పెరిగింది. జిల్లాలో గ్రీనరీని పెంచేందుకు ప్రతి ఏటా అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాలను గుర్తించి హరితహారంలో భాగంగా వందల ఎకరాల్లో మొక్కలు నాటారు. అంతేకాకుండా కొన్ని అటవీ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సీడ్ బాల్స్ కూడా వేశారు. అటవీ ప్రాంతాల్లో ఉండే మొక్కలతోపాటు ఔషధ మొక్కలను కూడా జిల్లా అటవీ శాఖ యంత్రాంగం నాటారు. దీంతో అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కలతో పచ్చదనం 3 నుంచి 4 శాతం మేర పెరిగినట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. హరితహారం కార్యక్రమం ప్రారంభానికి ముందు జిల్లాలో పచ్చదనం 22 శాతంగా ఉంది. ప్రస్తుతం 26 శాతం మేర పెరిగినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. హరిత నిధి కార్యక్రమంతో భవిష్యత్తులో హరితహారం కార్యక్రమానికి ఎలాంటి ఢోకా లేకుండా జిల్లాలో పచ్చదనం మరింత పెరుగనున్నది.
అటవీ ప్రాంతంలో 62 లక్షల మొక్కలు..
హరితహారం కార్యక్రమంతో జిల్లాలో పచ్చదనం పెరిగింది. జిల్లాలోని అటవీ ప్రాంతాలు మొదలుకుని రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో, గ్రామాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో, కమ్యూనిటీ భవనాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో జిల్లాలో పచ్చదనం పెంపొందింది. జిల్లాలో ఏడేండ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా 2015-16లో 73.78 లక్షల మొక్కలు, 2016-17లో 1.39 కోట్ల మొక్కలు, 2017-18లో 71.04 లక్షలు, 2018-19లో 86.12 లక్షల మొక్కలు, 2019-20లో 1.02 కోట్ల మొక్కలు, 2021-22లో 74 లక్షల మొక్కలు నాటారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2015-16లో 8 లక్షల మొక్కలు, 2016-17లో 10 లక్షల మొక్కలు, 2017-18లో 8.2 లక్షలు, 2018-19లో 6.98 లక్షలు, 2019-20లో 12.08 లక్షలు, 2020-21లో 8.28 లక్షలు, 2021-22లో 7.05 లక్షల మొక్కలు నాటారు. అంతేకాకుండా పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలతో జిల్లాలో పచ్చదనం మరింత పెరుగుతున్నది.
వికారాబాద్ జిల్లాలో..
పరిగి, అక్టోబర్ 7: హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు పెంచడంతో వికారాబాద్ జిల్లాలో పచ్చదనం భారీగా పెరిగింది. పర్యావరణ సమతుల్యత సాధనకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్రంలో 239 కోట్ల మొక్కలు నాటారు. వికారాబాద్ జిల్లాలో ఐదేండ్లలో సుమారు 2.5 కోట్ల మొక్కలు నాటారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలో నాటిన మొక్కల్లో అత్యధిక శాతం సంరక్షించడంతో 2శాతం పచ్చదనం పెరిగింది. గతంలో 9 శాతం ఉండగా హరితహారంతో 11 శాతానికి పెరిగింది. ఈసారి మొక్కలు నాటిన తర్వాత పచ్చదనం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
అడవుల్లో విరివిగా మొక్కలు..
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో భారీగా మొక్కలు పెంచేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. గతంలో కంటే జిల్లాలో అధిక విస్తీర్ణంలో మొక్కలు పెంచనున్నారు. ఆరేండ్లలో అటవీ ప్రాంతంలోని 1149 ఎకరాల్లో సుమారు 6,79,847 మొక్కలు నాటారు. 2016లో 176 ఎకరాలు 92,756 మొక్కలు, 2017లో 136 ఎకరాల్లో 66,655 మొక్కలు, 2018లో 7 ఎకరాల్లో 4,498 మొక్కలు, 2019లో 256 ఎకరాల్లో 1,50,508 మొక్కలు, 2020లో 251 ఎకరాల్లో 1,76,600 మొక్కలు, 2021లో 324 ఎకరాల్లో 1,88,830 మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో అత్యధికంగా సంరక్షించబడ్డాయి. ఎక్కడైనా మొక్క ఎండిపోతే దాని స్థానంలో మరో మొక్క నాటారు. వేసవిలో అవసరమైన చోట మొక్కలకు నీరు పోయడంతో చక్కగా పెరిగాయి. తద్వారా అటవీ ప్రాంతంలో పచ్చదనం మరింత పెరిగింది. గత నాలుగైదు ఏండ్ల క్రితం నాటిన మొక్కలు పెద్దగా పెరిగాయి. ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో అటవీ ప్రాంతాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా..
ఏ రోడ్డును చూసినా పచ్చని చెట్లే దర్శనమిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇంతమంచి కార్యక్రమాన్ని భవిష్యత్తు తరాలు గుర్తించుకునేలా చేపడుతున్నారు. మొక్కలు పెంచడంతో ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు జరుగుతుంది.
మొక్కల సంరక్షణ బాధ్యతగా తీసుకుంటా..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించి, వాటిని సంరక్షించడం నా బాధ్యతగా తీసుకుంటా. నర్సరీలో మొక్కలు పెంచినప్పటి నుంచి ఆ మొక్కలను రోడ్లవెంబడి, ఖాళీస్థలంలో నాటించి, వాటికి రోజూ నీటిని అందించడంలో ఎంతో ఆనందం ఉంటుం ది. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ప్రతిక్షణం అడవులు, పొలాల్లోనే గడుపుతూ మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుంటా.
నాటిన మొక్కలను సంరక్షించాం
జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆరేండ్లుగా 1149 ఎకరాల్లో 6,79,847 మొక్కలు నాటాం. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా మొక్క ఎండిపోతే వెంటనే మరో మొక్క నాటాం. తద్వారా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెరిగింది. జిల్లాలో హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోనూ పచ్చదనం శాతం పెరిగింది.
జిల్లాలో పచ్చదనం పెరిగింది..
హరితహారం కార్యక్రమంతో జిల్లాలో పచ్చదనం పెరిగింది. హరితహారం కార్యక్రమానికి ముందు జిల్లాలో 22 శాతంగా ఉన్న గ్రీనరీ ప్రస్తుతం 3నుంచి 4 శాతం పెరిగింది. ప్రతి ఏటా అటవీ ప్రాంతాల్లో లక్షల్లో మొక్కలు నాటుతున్నాం. అటవీ ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడంతో పచ్చదనం పెరిగింది. హరితనిధి కార్యక్రమం మంచి నిర్ణయం. హరితహారానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు.