ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 7: ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నందున బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి విజృంభించే అవకాశం ఉండడంతో సర్కారు అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని ఆదిలోని కట్టడి చేసేందుకు ప్రభు త్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఈ రోగాన్ని నివారించడం కోసం వ్యాక్సినేషనే మార్గమని భావించిన సర్కారు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఆగస్టు 16నుంచి ప్రారంభమైన ఈ వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమం ఈనెల 17వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి అంజిలప్ప తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28678టీకాలు సిద్ధంగా ఉంచారు.
వ్యాధి లక్షణాలు..
బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన పశువులు ఎదకు రావు. పాలు ఇవ్వడం మానేస్తాయి. మగ పశువుల్లో వ్యంధ్యత్వం, ఆడ వాటిలో గర్భధారణ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇది అంటురోగం కావడంతో ఒక్కదాని నుంచి మరో పశువుకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో విజృంభించే అవకాశాలున్నందున రైతులు సరైన జాగ్రత్తలు పాటించాలని పశువైద్యాధికారులు సూచించారు.
మనుషుల్లోనూ ప్రమాదకరం..
వ్యాధి బారిన పడిన పశువుల జున్నుపాలు తాగడం, శుద్ధి చేయని పాల ఉత్పత్తులను తినడం ద్వారా మనుషులకు ఈ రోగం సంక్రమిస్తుంది. పాడి రైతులు, పశువైద్యులు, మాంసం ఉత్పత్తుల, కోళ్ల పరిశ్రమల్లో పనిచేసే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధిగ్రస్తుల్లో ప్లూ లక్షణాలు దగ్గు, జ్వరం, తలనొప్పితో పాటు వెన్నునొప్పి, కీళ్లనొప్పులు, మగవారిలో వ్యంధత్వం,స్త్రీలలో గర్భస్రావం తదితర సమస్యలు ఏర్పడే అవకాశమున్నది.
వ్యాక్సినేషన్‌తోనే అడ్డుకట్ట..
ఈ వ్యాధి నివారణే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జాతీయ బ్రూసెల్లోసిస్ నిరోధక టీకా కార్యక్రమాన్ని ఆగస్టు 16న ప్రారంభించారు. ఈ నెల 17వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు. 4 నుంచి 8నెలల వయస్సు ఉన్న ఆవులు, గేదెజాతి దూడలకు టీకాలు వేస్తున్నారు.జిల్లాలో 28678పశువులకు టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 28678టీకాలు అందుబాటులో అందుబాటులో ఉంచారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 12,472దూడలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈనెల 17వరకు మిగిలిపోయిన అన్ని మూగజీవాలకు టీకాలు వేయనున్నారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో సుమారు 40వైద్యబృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. బ్రూసెల్లోసిస్ పశువుల నుంచి మనుషులకు సైతం సోకే అవకాశం ఉన్నందున టీకాలు వేసే సిబ్బంది పీపీఈ కిట్లు ధరించడంతో పాటుగా చేతులకు పూర్తిస్థాయి గ్లౌస్లు, ముఖానికి మాస్కు, ఫేస్‌షీల్డ్‌లు ధరించి టీకాలు వేస్తున్నారు.
టీకాలు తప్పనిసరిగా వేయించాలి
4 నుంచి 8నెలల వయస్సున్న దూడలకు బ్రూసెల్లోసిస్ నివారణ టీకాలు వేయించాలి. బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఆవులు, గుర్రా లు, కుక్కలు వంటి జంతువులకు ఈ వ్యాధి సోకుతుంది. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది. పాడి రైతుల నష్టపోకుండా ముందస్తుగా దూడలకు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలి.
-అంజిలప్ప, జిల్లా పశువైద్యాధికారి