రంగారెడ్డి, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని ‘రెవెన్యూ’ శాఖకు అవినీతి మకిలీ పట్టుకున్నది. పారదర్శక సేవలు, అక్రమాలకు చెక్ పెట్టేలా ఎన్ని సంస్కరణలు చేపట్టినా.. అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. కంచే చేను మేసిన చందంలా.. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు.
ఇష్టారాజ్యంగా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా కలెక్టరేట్ కార్యాలయాన్నే అడ్డాగా చేసుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి అధికారుల్లోనూ భయం లేకుండా పోతున్నది. ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారి బాస్‌గా వ్యవహరిస్తూ లంచాల జాడ్యాన్ని కొనసాగిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన భారతిహోలికేరి హయాంలో ఏకంగా 98 భూ రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయి.
దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్లు అమయ్‌కుమార్, హరీశ్‌లు సైతం భూ సంబంధిత వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. 2016లో అప్పటి అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఈ-సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిలు ఏసీబీ వలకు చిక్కడంతో ఇక్కడ అవినీతి ఏమేర ఉందో అర్థమవుతున్నది.
డిజిటల్ ‘కీ’ ఉన్నా.. ఆగని అక్రమాలు..
ఒక అధికారి సంతకాన్ని సులువుగా ఫోర్జరీ చేసే విధానానికి స్వస్తి పలకాలన్న ఉద్దేశంతో ధరణిలో కేసీఆర్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, తహసీల్దార్లకు డిజిటల్ సంతకాన్ని ఇచ్చింది. సంప్రదాయ చేతి సంతకంతో పోలిస్తే ఈ డిజిటల్ సంతకం ఎక్కువ భద్రత ఉంటుందనే ఉద్దేశంతో ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ పరమైన అంశాల్లో డిజిటల్ ‘కీ’ని కీలకంగా చేసి అప్పటి ప్రభుత్వం అమలు చేసింది.
అయినప్పటికీ జిల్లాలో గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో 98 ఫైళ్లకు సంబంధించి ధరణిలో అక్రమ లావాదేవీలు జరిగాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సైతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. కలెక్టర్ దగ్గర దీనికి సంబంధించి ‘కీ’ ఉండగానే ఈ వ్యవహారం చోటుచేసుకున్నది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి కలెక్టర్ భారతిహోలికేరిపై బదిలీవేటు వేయగా.. బాధ్యులైన ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులపై పోలీసు కేసు నమోదు అయింది.
గతంలో కందుకూరు ఆర్డీవో కార్యాలయంలోనూ ధరణి ఆపరేటర్‌పై ఆరోపణలు రాగా.. కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. ఇటీవల మంచాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ‘కీ’ని ఉపయోగించి అక్రమంగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన ఆపరేటర్‌ను విధుల నుంచి తొలగించారు. కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఓ ఆర్మీ జవాన్ బట్టబయలు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ తరహా ఘటనలు జిల్లాలో కోకొల్లలు.
పైసా లేనిదే పనికాదు..
ఏ పని కావాలన్నా.. పైరవీ కారులు చెప్పాలి. పైసా లేనిదే పని కాదు. చిన్నస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి అధికారి వరకు అంతా వసూళ్లే. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనమైతే.. సిబ్బంది దళారులుగా వ్యవహరిస్తున్నారు. మ్యుటేషన్ మొదలుకుని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వరకు ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు చెల్లించినప్పటికీ లక్షల్లో వసూలు చేస్తున్నారు. పైసలిస్తే..అసైన్డ్ భూములకూ పట్టాలిస్తున్నా రన్న విమర్శలున్నాయి. వారసత్వం, ఫౌతీ వాటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్షల్లో జీతాలు తీసుకునే ఉన్నతాధికారులు ఇలా.. బరితెగించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మొరపెట్టుకునేందుకు కలెక్టరేట్‌కు వస్తే.. ఇక్కడా అదే తంతు నడుస్తుండడంతో బాధితులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలోని రెవెన్యూను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.