బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లగా, వికారాబాద్ జిల్లాలోని మూసీ, కాగ్నా నదులు, రంగారెడ్డి జిల్లాలోని ఈసీ వాగుతోపాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామీణ ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. పలు చెరువులు, కుంటలు నిండడంతో పాటు వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలు నీట మునిగాయి. మరో రెండు రోజులూ భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
వికారాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. వికారాబాద్-గిరిగెట్‌పల్లి మధ్య, నస్కల్ వాగు వరదతో పరిగి-వికారాబాద్ రాకపోకలు నిలిచిపోగా, దోర్నాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ధారూరు-దోర్నాల తదితర ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం వరకు రాకపోకలు స్తంభించాయి. మరో రెండు రోజులూ భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బందిని అందుబాటులో ఉంచింది. వాగుల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఆగస్టు నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. 8 మండలాలు మినహా అన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు నాటికి సాధారణ వర్షపాతం 466.8 మి.మీటర్ల కాగా, ప్రస్తుతం 576.2 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం.
మత్తడి దుంకుతున్న చెరువులు..నీట మునిగిన పంటలు..
జిల్లాలోని పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. జిల్లా కేంద్రంలోని శివసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారి అలుగుపారుతున్నది. సర్పన్‌పల్లి చెరువు నిండింది. పరిగి, కులకచర్ల, దోమ, చౌడాపూర్, మర్పల్లి, ధారూరు మండలాల్లోని చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. వాగులు, చెరువులకు సమీపంలోని పొలాలు నీట మునిగాయి. పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
రంగారెడ్డి జిల్లాలో…
షాబాద్ : రంగారెడ్డి జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమగనల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అత్యధికంగా కొందుర్గు మండలంలో 38.5 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లో 3.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షానికి ఈసీ, మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గ్రామీణ రోడ్లు ధ్వంసమై బురదమయంగా మారడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు, పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
వికారాబాద్ జిల్లాలోని పరిగి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో నాగరగూడ ఈసీ వాగు పారుతుందని, షాబాద్ మండలంలో అనుకున్న స్థాయిలో వర్షాలు పడడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా వర్షం పడకపోవడంతో చెరువుల్లోకి నీరు రాలేదు. ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనైనా భారీ వర్షాలు కురిస్తే ఈ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నిండుతాయని రైతులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం
శంకర్పల్లి : 24.1
శేరిలింగంపల్లి : 11.6
గండిపేట్ : 7.8
రాజేంద్రనగర్ : 9.1
బాలాపూర్ : 4.2
సరూర్‌నగర్ : 3.8
హయత్‌నగర్ : 3.8
అబ్దుల్లాపూర్‌మెట్ : 3.2
ఇబ్రహీంపట్నం : 5.1
మంచాల : 3.9
యాచారం : 6.8
మాడ్గుల : 6.5
ఆమనగల్లు : 7.3
తలకొండపల్లి : 20.5
కేశంపేట : 25.8
కడ్తాల్ : 4.3
కందుకూర్ : 6.7
మహేశ్వరం : 9.4
శంషాబాద్ : 11.2
మొయినాబాద్ : 12.1
చేవెళ్ల : 29.5
షాబాద్ : 19.9
కొత్తూరు : 18.3
నందిగామ : 20.3
ఫరూఖ్‌నగర్ : 21.7
కొందుర్గు : 38.5
చౌదరిగూడ : 31.0
జిల్లా మొత్తం : 13.6 మి.మీ
వికారాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం
మండలం : మి.మీటర్లు
చౌడాపూర్ : 70.2
కోట్‌పల్లి : 27.9
బంట్వారం : 21.4
వికారాబాద్ : 42.2
బషీరాబాద్ : 42.8
పూడూరు : 43.9
మోమిన్‌పేట : 42.2
యాలాల : 38.9
తాండూరు : 36.7
దోమ : 51.6
దుద్యాల : 55.3
పెద్దేముల్ : 22.6
కొడంగల్ : 42.5
దౌల్తాబాద్ : 53.3
కులకచర్ల : 65.6
పరిగి : 55
మర్పల్లి : 14.8
ధారూరు : 45.6
బొంరాస్‌పేట : 50.0
జిల్లా మొత్తం : 43.1 మి.మీ