పరిగి, జూన్ 2: గ్రామ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని చిట్యాల్ గ్రామంలో వికారాబాద్ కలెక్టర్ నిఖిలతో కలిసి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నదన్నారు.
ప్రతినెలా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. చిట్యాల్ గ్రామంలో ఎకరం స్థలంలో రూ.4 లక్షలు వెచ్చించి గుట్టను తవ్వి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలానికి రెండు క్రీడా ప్రాంగణాలను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించినట్లు తెలిపారు. క్రీడా ప్రాంగణానికి అవసరమైన సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులను కూడా మంజూరు చేశామన్నారు.
శుక్రవారం నుంచి జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమవుతుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో శేషగిరిశర్మ, తహసీల్దార్ రాంబాబు, ఎంపీవో దయానంద్, ఎం పీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, సర్పంచ్ రజిత, ఎంపీటీసీ వెంకటేశ్ పాల్గొన్నారు.