పరిగి, జూన్ 2 : తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర గొప్పదని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ స్ఫూర్తి అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజెప్పడంలో కవులు, కళాకారుల పాత్ర గొప్పదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే అమరులకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజున కవి సమ్మేళనం నిర్వహించి కవులను ప్రోత్సహిస్తూ సన్మానించడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. కరోనా కారణంగా రాష్ట్ర అవతరణ సందర్భంగా కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులకు చేదోడు వాదోడుగా ఉంటుందని పేర్కొన్నారు. కవుల మాటలతో రాళ్లు పగులుతాయి అనే నానుడి ఉందని, నేడు స్పష్టంగా కనబడుతున్నదన్నారు.
కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. తెలంగాణ స్ఫూర్తి అంశంపై నాలుగు భాషల్లో తమ కవితలను వినిపించేందుకు సమ్మేళనంలో కవులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో మహిళలు పాల్గొనడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కవి సమ్మేళనంలో 16 మంది కవులు పాల్గొనగా.. సమ్మేళనం అనంతరం కవులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమాధికారి హనుమంతరావు, జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, ఆర్డీవో విజయకుమారి, వికారాబాద్ తహసీల్దార్ షర్మిల, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.