రంగారెడ్డి, (నమస్తే తెలంగాణ)/పరిగి, జూన్ 2 : శుక్రవారం నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు నిర్వహించనున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో జిల్లా పంచాయతీ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రధానంగా పెండింగ్ పనులను పూర్తి చేసేలా ప్రణాళికలను తయారు చేశారు. గ్రామపంచాయతీలతోపాటు మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేయడం, వైకుంఠధామాల్లో భగీరథ ద్వారా నీటి సరఫరా చేయడం, మరుగుదొడ్లను నిర్మించడం, పెండింగ్‌లో ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయడం, మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్-వెజ్ మార్కెట్ల నిర్మాణాలు పూర్తిచేయడంపై దృష్టి సారించనున్నారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ఫలప్రదం చేసేందుకు మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సన్నాహక సమావేశంతోపాటు నియోజకవర్గ, మండల స్థాయిల్లో సన్నాహక సమావేశాలను కూడా ఇప్పటికే నిర్వహించారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పచ్చదనం దర్శనమిస్తున్నది. పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల్లోనూ పారిశుధ్యం మెరుగుపడింది. పల్లె ప్రగతి కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లాలో రెండేండ్లలో ప్రతి నెలా రూ.4కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.104 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణ ప్రగతి కింద ప్రతినెలా రూ.2.12 కోట్ల చొప్పున ఇప్పటివరకు జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లకు రూ.57.14 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
నేటి నుంచి 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు
ఈ నెల 3 నుంచి 18 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అన్ని గ్రామపంచాయతీల్లో పాదయాత్ర నిర్వహించి గ్రామసభలను నిర్వహిస్తారు. సభల్లో గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాలు, పల్లెప్రగతిలో సాధించిన విజయాలను తెలుపనున్నారు. సభలో జీపీ స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ పాల్గొంటారు. పదిహేను రోజులపాటు రోడ్లు, మురుగు కాల్వలను పరిశుభ్రం చేయడం, ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై పారకుండా ప్రజలకు అవగాహన కల్పించి, ప్రతి కుటుంబం మ్యాజిక్ ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించనున్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించాలని అవగాహన కల్పిస్తారు.
రెండు రోజులపాటు గ్రామపంచాయతీ అధికారులు గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ ప్రజోపయోగ సంస్థలన్నింటినీ పరిశుభ్రం చేయనున్నారు. గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్, హరితహారం ప్లాంటేషన్‌కు అనువైన ప్రదేశాలను గుర్తిస్తారు. ఒక రోజు పవర్ హాలీడేను నిర్వహించి గ్రామపంచాయతీల్లోని విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించనున్నారు. డంపింగ్ యార్డు, వైకుంఠధామాలను సందర్శించడం, గ్రామస్తుల సహకారంతో శ్రమదానం నిర్వహించి పిచ్చిమొక్కలను తొలగిస్తారు. గ్రామాల్లో పాడుబడిన బావులు, నిరుపయోగ బోరుబావులను పూడ్చివేయనున్నారు.
గ్రామాల్లో కాలువ, చెరువు గట్లకు సంబంధించి నీటి పారుదల శాఖ అధికారుల సమన్వయంతో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలను నాటుతారు. చివరి రోజున గ్రామ సభ నిర్వహించి పదిహేను రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతోపాటు గ్రామాలు ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్, మోడల్ అర్హత సాధించిన గ్రామాల వివరాలను గ్రామసభలో ప్రకటించనున్నారు. పదిహేను రోజులపాటు పల్లెప్రగతిలో అత్యుత్తమ సేవలందించిన అధికారులు, అనధికారులను సన్మానిస్తారు. పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామాల నిర్మాణాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు.
వికారాబాద్ జిల్లాలో మండలాలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులు
మండలాలు, మున్సిపాలిటీలకు జిల్లాస్థాయి అధికారులను కలెక్టర్ నియమించారు. వికారాబాద్ మండలానికి జడ్పీ డిప్యూటీ సీఈవో సుభాషిణి, ధారూరుకు డీఎస్సీడీవో మల్లేశం, కోట్‌పల్లికి డీసీఎస్వో రాజేశ్వర్ప్రసాద్, బంట్వారానికి అదనపు డీఆర్డీవో నర్సింహులు, మర్పల్లికి డీఎల్పీవో అనిత, మోమిన్పేట్కు జిల్లా మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్, పరిగికి డీబీసీడీవో ఉపేందర్, చౌడాపూర్కు డీజీడబ్ల్యూవో దీపారెడ్డి, పూడూరుకు డీఎండబ్ల్యూవో సుధారాణి, దోమకు డీటీడీవో కోటాజీ, కులకచర్లకు డీవైఎస్వో హన్మంత్‌రావు, తాండూరుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, యాలాలకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాంరెడ్డి, పెద్దేముల్‌కు ఆడిట్ ఆఫీసర్ వీరభ్రదరావు, బషీరాబాద్‌కు డీఆర్డీఏ అడిషనల్ పీడీ స్టీవెన్ నీల్, కొడంగల్‌కు ఏపీడీ సరళ, నవాబుపేటకు డీడబ్ల్యూవో లలితకుమారి, వికారాబాద్ మున్సిపాలిటీకి జిల్లా అటవీ శాఖాధికారి వేణుమాధవరావు, తాండూరు మున్సిపాలిటీకి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వినయ్‌కుమార్, పరిగి మున్సిపాలిటీకి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్, కొడంగల్ మున్సిపాలిటీకి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమలను ప్రత్యేకాధికారులుగా కలెక్టర్ నిఖిల నియమించారు. ప్రతి గ్రామపంచాయతీకి మండలస్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించారు.