జీవో 58 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సర్కార్ చర్యలను ముమ్మరం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే రెండుసార్లు అవకాశమివ్వగా.. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 19,692 దరఖాస్తులు అందాయి. కాగా, శుక్రవారం నుంచి దరఖాస్తుల పరిశీలనను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. అన్ని విభాగాల అధికారులు సభ్యులుగా 40 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక్కో బృందం రోజుకు 25 దరఖాస్తులను పరిశీలిస్తుండగా.. పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఉన్నతాధికారులు ముందుకు సాగుతున్నారు. దరఖాస్తుల పరిశీలనలో ప్రధానంగా నాలుగు అంశాలపై ఆరా తీస్తున్నారు. స్థలం 125 చదరపు గజాలలోపు ఉన్నదా, ఇల్లు 2-6-2014కు ముందు నిర్మించినదేనా.. దరఖాస్తుదారులు దారిద్య్రరేఖకు దిగువ చెందినవారేనా.. స్థలం ప్రభుత్వ అభ్యంతరకర భూముల జాబితాలో ఉందా.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.
రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల ఉచిత క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిన జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా, మార్చి 31తో ముగిసింది. అయితే 90 రోజుల్లో దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం శుక్రవారం నుంచి జిల్లాలో జీ వో 58 కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ జిల్లాలో 40 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులతోపాటు రెవెన్యూ శాఖకు చెందిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. జిల్లాలోని అర్బన్ మండలాల్లో అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించేందుకు ఆయా మండలాలకు ఎక్కువ బృందాలకు కేటాయించారు. ఒక్కో వెరిఫికేషన్ బృందం రోజుకు 25 దరఖాస్తులను పరిశీలించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం దరఖాస్తుదారుల ఇంటింటికెళ్లి పరిశీలించనున్నారు. అయితే వారం, పది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే జీవో 58 కింద జిల్లావ్యాప్తంగా 19,692 దరఖాస్తులు రాగా, అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలో 6,485, బాలాపూర్ మండలం లో 4,124 దరఖాస్తులు వచ్చాయి. జీవో 58 కింద దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసిన తర్వాత జీవో 59 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు.
2014 జూన్ 2కు ముందు నిర్మించుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కటాఫ్ తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పరిశీలన ప్రక్రియలో భాగంగా అధికారులు నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నారు. జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి 125 చదరపు గజాలలోపు ఉన్నదా.. ? లేదా..? అని పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 125 గజాలకుపైగా ఉంటే జీవో 59 పరిధిలోకి వస్తుందని పరిశీలన బృందా లు రిమార్కుగా రాస్తున్నారు. అదేవిధంగా 02-06-2014కు ముందు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఉండి నివాసయోగ్యంగా ఇల్లు ఉందా ..? లేదా అనేది పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా దరఖాస్తుదారుడు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారా..? లేదా.. పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటితోపాటు ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్టర్డు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను చలాన్, విద్యుత్, నీటి బిల్లులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలం ప్రభు త్వ అభ్యంతరకర భూములు జాబితా(అసైన్డ్ భూములు, మిలిటరీ-కంటోన్మెంట్, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, కోర్డు కేసు, ఖాళీ స్థలం, మెట్రో రైల్‌కు కేటాయించిన స్థలం, కుంట, శిఖం భూములు, ఎఫ్టీఎల్, పైగా భూములు, భూదాన్, దేవాదాయ, వక్ఫ్, డిఫెన్స్, శ్మశానవాటిక భూములు)లో ఉందా..? లేదా..? అనేది పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పై నాలుగు అంశా ల్లో ఏది సరిగ్గా లేకున్నా పరిశీలన బృందాలు క్షేత్రస్థాయిలోనే రిమార్క్‌గా రాస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా జీవో 58, 59 దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే జిల్లా రెవెన్యూ యంత్రాంగం దరఖాస్తులు వచ్చిన మండలాల్లో గ్రామాలవారీగా ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, కోర్టు కేసులున్న భూముల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాయి.
జీవో 58 కింద వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని పరిశీలన బృందాలను రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్కాలనీలో జరుగుతు న్న పరిశీలన ప్రక్రియను ఆయన అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన కోసం ప్రత్యేకంగా 40 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు.