ధీరత్వమే దైవత్వమై ఆధ్యాత్మిక నిలయంగా మారిన మేడారంలో తల్లి సమ్మక్క ఆగమనం గురువారం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. అధికార యంత్రాంగం గౌరవ సూచకంగా ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపి స్వాగతించగా, వేలాది మంది పోలీసుల రక్షణ వలయంలో చిలుకల గుట్టనుంచి సమ్మక్క తరలివచ్చింది. దారి పొడవునా పసుపు, కుంకుమలతో ముగ్గులు వేసి యాట బలులు, ఎదురుకోళ్లు, ఒడిబియ్యం మొకులు చెల్లిస్తూ అశేష భక్తజనం తన్మయత్వంతో ఎదురుచూస్తుండగా ఆదివాసీల నృత్యాల హోరు, శివసత్తుల పూనకాల జోరులో ‘కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం’ గద్దెపై కొలువుదీరింది. మహాజాతరలో అత్యంత ప్రధానమైన ఈ ఘట్టం ప్రశాంతంగా ముగియగా పురా ఆత్మలను ఆలింగనం చేసుకుంటూ మొక్కులు తీర్చేందుకు వస్తున్న వారితో తల్లుల ప్రాంగణం పోటెత్తుతున్నది.
-ములుగు, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) /తాడ్వాయి