గురుపౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేసి, సామూహిక సాయి వ్రతాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీషిర్డీ సాయిబాబా ఆలయాలను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
ఇబ్రహీంపట్నం, జూలై 13 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపురం గేటు వద్ద సద్గురుసాయినాథ్ ఏకశిలా మందిరంలో జరిగిన గురుపౌర్ణమి వేడుకలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో వేలాదిమంది భక్తుల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ మడుపు వేణుగోపాల్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, కౌన్సిలర్లు పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోగల సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు కనుల పండువగా సాగాయి. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సద్గురు సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయి నామస్మరణం
పెద్దఅంబర్‌పేట : గురు పౌర్ణమిని పురస్కరించుకుని మున్సిపాలిటీలోని సాయిబాబా ఆలయాల్లో సందడి నెలకొన్నది. ముసురు వానలోనూ వచ్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట సాయినగర్ కాలనీలోని సాయిబాబా గుడిలో ఆలయ కమిటీ, కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భజన మండలివారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా తట్టి అన్నారం జీవీఆర్ కాలనీలో శ్రీసాయి నీలకంఠేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా గుడిలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మత్తడి శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ రమావత్ పరశురాంనాయక్, కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండువ కార్తీక్, ఆలయ కమిటీ చైర్మన్ జైరాం ఉన్నారు.
పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి
ఆదిబట్ల : కొంగరకలాన్ గ్రామంలోని సాయిబాబా మందిరంలో వార్షికోత్సం, గురుపౌర్ణమిని నిర్వహించారు. వివిధ రకాల పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్యామ మల్లేశ్ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపల్ కౌన్సిలర్లు మహేందర్, వనం శ్రీను, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.
లలితా సహస్రనామ పారాయణం..
కడ్తాల్ : మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం లో ప్రధాన పురోహితుడు ఎల్లికంటి వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేసి, సాముహిక సాయి వ్రతాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు భాస్కర్‌రెడ్డి, అంజయ్య, మల్లప్ప, శాయిరెడ్డి, మల్లేశ్, మహిళలు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని షాద్‌నగర్ మున్సిపాలిటీలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో బుధవారం వేడుకలను శ్రీ శేషసాయి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి వివిధ పూజా కార్యక్రమాలు ప్రారంభమయాయి. ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్‌తో కలిసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. షాద్‌నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కౌన్సిలర్లు పూజలు నిర్వహించారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ శేషసాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు డాక్టర్ విజయ్‌కుమార్, శారద, సుధాకర్, జంగయ్యగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, క్రాంతికుమార్, సంతోష్, అర్చకులు హరిశర్మ పాల్గొన్నారు.
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
శంకర్పల్లి : మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపురంలో శ్రీ గురు రాఘవేంధ్ర స్వామి మఠంలో శివశక్తి మండల అధ్యక్షుడు సాయికుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దంపతులకు భగవద్గీత, హనుమాన్ చాలీసాలను అందజేశారు. కార్యక్రమంలో కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు
నందిగామ : చేగూరు గ్రామంలోని శ్రీ సాయిబాబా దేవాలయంలో మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ విఠల్ గ్రామస్తులతో కలిసి పూజలు చేశారు.
షాబాద్: షాబాద్ మండలంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివానంద సేవాసమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మహర్షివేద గురుకుల పాఠశాలలో నిర్వాహకులు శరత్గోపాల్ ఆచార్య, సోమశేఖర్‌ల ఆధ్వర్యంలో గురుపౌర్ణమి నిర్వహించారు.