కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండొద్దని.. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్‌తివారీ అధికారులకు సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ.. లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని గోనూర్, యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌లోని రైస్‌మిల్, తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు విషయంలో రైతులను అధికారులు, మిల్లర్లు, ఇబ్బంది పెడితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
రంగారెడ్డి, మే 14 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈమేరకు గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి, మ్కొజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ లోడింగ్, లిఫ్టింగ్ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐకేపీ, డీసీఎంఎస్, సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాల్లో ఆశించిన రీతిలో కొనుగోలు జరగడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.
వెంటనే అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా లోడింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని, అందుకు అవసరమైన లారీలు, హమాలీలు తగిన మేరకు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా కాంటా వేసి మిల్లులకు తరలించే చర్యలు చేపట్టాలన్నారు.
రైతులు తమ పంటను విక్రయించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని తెలిపారు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను పరిశీలనలో పారదర్శకత పాటించాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివరాలు నమోదు చేసిన రిజిస్టర్లను ఆయన పరిశీలించారు. వరి, మొక్కజొన్న నిల్వల్లో ఎలాంటి నష్టం జరుగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణను విజయవంతం చేయాలి
ఆదిబట్ల : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటింటి సర్వే ద్వారా అర్హులైన ప్రతి ఓటర్ను గుర్తించి నమోదు చేయాలని సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. తప్పుడు ఎంట్రీలు లేకుండా జాబితాను కచ్చితంగా రూపొందించాలని పేర్కొన్నారు. యువత, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.