చేవెళ్ల రూరల్, డిసెంబర్ 27 : చేవెళ్ల మన్సిపాలిటీలో రామన్నగూడను కలుపొద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ యువ నాయకుడు పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో రైతులు, వ్యవసాయ కూలీలు ఎకువగా ఉన్నారని, వారంతా ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీలో చేర్చితే పన్నులు పెరుగడమే కాకుండా పనులు సైతం దొరకవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి మినహాయించేలా చూడాలని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు.