వికారాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోష్ కనిపిస్తున్నది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతోపాటు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిలతో అధిష్ఠానం సమాలోచనలు చేస్తూ గెలుపే లక్ష్యంగా సాగుతున్నది. నాలుగు మున్సిపాలిటీల్లో గత కేసీఆర్ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరగడం.. తదనంతరం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధికి నయాపైసా నిధులివ్వకపోవడంతో ప్రజలంతా పురపోరులో కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని తిట్టడం మినహా చేసిందేమీ లేకపోవడంతోపాటు మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా పారిశుధ్యం, అధ్వానంగా రోడ్లు, మరమ్మతులకు నోచుకోని పార్కులు తదితర సమస్యలతో ప్రజలతోపాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులూ బీఆర్ఎస్కే కొడుతున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తించిన ఇతర పార్టీల నాయకులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకులు డాక్టర్ సంపత్, విఠల్‌నాయక్, వెంకటేశ్చారితోపాటు వందల మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడంతోపాటు ఆయా వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఆయన సోదరుడి కోటరీకి తప్ప పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు లేకపోవడంతో బీఆర్ఎస్తోనే గతంలో తాండూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని భావించి గులాబీ పార్టీలోకి చేరికలు జోరం దుకున్నాయి. అదేవిధంగా పరిగి మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు ఒక్కొక్కరుగా ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి అంటూ చేరికలు…
బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమంటూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రెండేండ్లు దాటినా ఇప్పటికీ రూపాయీ కేటాయించకపోవడంతో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలి టీల్లో పాలన స్తంభించింది. నిధుల లేమితో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీల్లో రూ. వందల కోట్లతో అన్ని గల్లీల్లోనూ రోడ్లు, మురుగు కా ల్వలు, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్లను ఏర్పా టు చేస్తే.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రోడ్ల మరమ్మతులు కానీ కనీసం డ్రైనేజీ మరమ్మతులూ చేయకపోవడం శోచనీయం. కొడంగల్ సెగ్మెంట్ నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేకపోవడం గమనార్హం. తాండూరు మున్సిపాలిటీకి సుమా రు రూ.200 కోట్ల వరకు నిధులను బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తీసుకొస్తే.. ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసి, ఆ నిధులను మేమే తీసుకొచ్చినట్లు స్థానిక ఎమ్మెల్యే ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలోనూ బీఆర్ఎస్ హయాంలో రూ.200 కోట్లతో బ్రిడ్జి మంజూరు తోపాటు ప్రతి వార్డులోనూ రోడ్లు, పార్కులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణ ప్రకృతివనాలు, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తే కనీసం పార్కుల నిర్వహణకూ కాంగ్రెస్ సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో ఓపెన్ జిమ్‌లు పనికి రాకుండా పోతున్నాయి. పరిగి, కొడంగల్ మున్సి పాలిటీల్లోనూ పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి రూ.200 కోట్లకుపైగా నిధులను గత ప్రభుత్వంలో విడుదలయ్యాయి.