వికారాబాద్/చేవెళ్ల రూరల్/చేవెళ్ల టౌన్, ఫిబ్రవరి 6 : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఎట్లుండేదని.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గిట్ల మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలువగా.. ప్రస్తుత రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ల మున్సిపల్ పరిధి దామరగిద్ద 9 వార్డు, చేవెళ్లలోని 12, 14, 15, 16, 17, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బేగరి అనిల్‌కుమార్, మిట్ట లతాదేవీరంగారెడ్డి, తలారి యాదయ్య, లావణ్యానత్తి కృష్ణారెడ్డి, కనకమామిడి నవనీతామల్లారెడ్డి, దండు లతాగౌరీసత్యం, కడమంచి ఆనంద్ తరపున అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. దామరగిద్ద గ్రామాన్ని ప్రజలు వద్దన్నా ప్రభుత్వం మున్సిపల్లో విలీనం చేసిందని.. ఇకపై పన్నులు, నీటి బిల్లుల మోత ప్రజలపై పడకుండా ఉండాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ప్రభుత్వంపై పోరాడి మీ పై పడిన భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు.
మహిళలు ఆత్మగౌరవం తో జీవించేలా బిందెలతో రోడ్లపైకి వెళ్లకుండా ఇంటి వద్దకు నల్లాల ద్వారా తాగునీటిని అందించిన కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డి లేదన్నారు. కాం గ్రెస్ పాలనలో యూరియా దొరకక మహిళలు సైతం క్యూలో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయడంలేదని ఆరో పించారు. ఫ్రీ బస్సు పథకంతో ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పొగొడుతున్నారని..ఆడవారికి ఉచితం చేసి.. మగవారి నుంచి డబుల్ చార్జీలు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హామీల అమల్లో విఫమమైన కాంగ్రెస్ సర్కార్‌కు మున్సిపల్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రూ.4 వేల పింఛన్ ఊసేలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఉంటే దళిత బంధు పథకం అమలయ్యేదని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బేగరి అనిల్ కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపిస్తే మీ వెంట నేనుంటా.. నా వెంట కేసీఆర్ ఉంటారని, మీరు వేస్తున్న ఓటు సబితమ్మ, కేసీఆర్‌కు అనుకొని వేయాలన్నారు. ప్రచారంలో రామన్నగూడ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దోళ్ల గోపాల్ గోపాల్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మిట్ట లతాదేవి, నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఇంచార్జి దేశమొల్ల ఆంజనేయులు, కమ్మెట మాజీ సర్పంచ్ పట్లోళ్ల హన్మంత్ రెడ్డి, వ్యవసాయ మారెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నర్సిములు, బీఆర్ఎస్ నాయకులు గోనె కరుణాకర్ రెడ్డి, వనం మహేందర్ రెడ్డి, ముకుందం గౌడ్, శేఖర్ రెడ్డి, పోతురాజు మల్లేష్, ఏర్పుల మల్లేష్, ఏర్పుల అంజయ్య, రామస్వామి, సామెల్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.