హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో కాగితం రహిత (పేపర్ లెస్) పాలనను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ అన్నారు. ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల సత్వర పరిషారం సాధ్యమవుతుందని, పరిపాలనలో జవాబుదారీతనం పెరుగుతుందని పేరొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీవీ ఆనంద్ శుక్రవారం లక్డీకాపుల్‌లోని ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన ‘ఈ-ఆఫీస్’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ప్రాసిక్యూషన్ విభాగంలో ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన డైరెక్టర్‌ను, సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం ప్రాసిక్యూషన్ విభాగం కోసం రూపొందించిన ‘ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నిర్వహణ వ్యవస్థ’ను ప్రారంభించారు. ఈ డిజిటల్ విధానం వల్ల సిబ్బంది హాజరులో క్రమశిక్షణ, పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.