వికారాబాద్, జనవరి 25 : జిల్లాలో 17 ఏండ్లు నిండిన యువత ముందస్తుగా ఫామ్ 6 ద్వారా ఓటరుగా పేరును నమోదు చేసుకొని, 18 ఏండ్లు నిండిన తర్వాత ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నదన్నారు.
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకొని, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఓటు హక్కు వినియోగించుకో వడానికి దివ్యాంగులకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు వీల్ చైర్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సందేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రూపొందించిన పాటను వినిపించి, ప్రతిజ్ఞ చేయించారు.
ప్రతి ఎన్నికల్లో అత్యధిక సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లాకు చెందిన 95 ఏండ్ల సీనియర్ సిటిజన్ జి.భూమయ్యను ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాల, కళాశాల విద్యార్థులు, ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, స్వీప్ మోడల్ ఆఫీసర్ కోఠాజీ, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా యువజన, క్రీడల అధికారి హనుమంతరావు, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి శంకర్‌నాయక్, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సుధారాణి, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదే..
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదేనని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 13వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి హరిప్రియ, ‘భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, కులం, వర్గం, భాష, ఎటువంటి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఙ చేయించారు.
భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సందేశాన్ని వినిపించారు’. అనంతరం, ఆమె మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుందని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటు హక్కును కలిగి ఉండడం ప్రథమ కర్తవ్యమని, అలాగే దాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ పేర్లను నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, ‘మీ ఓటే.. మీ స్వరం.. మీ భవిష్యత్తుకు నాంది’ అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం, ఏడాదిలో నాలుగుసార్లు జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించడంతో పాటు 17 ఏండ్లు నిండిన యువత కూడా ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినదన్నారు. ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదుతో పాటు 6-బీ ద్వారా ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ లింక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ సంక్షేమ అధికారి రామారావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి ప్రవీణ్ కుమార్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.