అసలే వర్షాకాలం.. ఆపై ముమ్మరంగా కొనసాగుతున్న వ్యవసాయ పనులు.. దీనికి తోడు ఇది పాముల కాలం.. వెరసి రైతన్నలకు విషసర్పాలతో పొంచి ఉన్న ప్రమాదం.. వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు, సూచనలతో పాటుగా అప్రమత్తతే రైతులకు శ్రీరామరక్ష కానున్నది. వర్షాకాలంలో వ్యవసాయ పనుల్లో తలమునకలైన రైతులు గతంలో పాము కాటుకు గురై తమ నిండు ప్రాణాలను కోల్పోయారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు గిరిజన తండాల్లో ఇలాంటి ఘటనలు అధికంగా చోటుచేసుకుంటాయి.
గతంలో ఆధునిక వైద్యం అందుబాటులో లేకపోవడంతో నాటు వైద్యాన్ని, మంత్రాలు, ఆకురసం, చెట్ల మందులను ఆశ్రయించి మూఢ నమ్మకాలపై విశ్వాసంతో ప్రాణాలు విడిచేవారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పాము కాటు మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు పాము కాటుకు గురైన వెంటనే బాధితుడిని సకాలంలో దవాఖానకు తరలిస్తే అతడి ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
– యాచారం, జూన్ 23
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాములతోపాటు ఇతర విష కీటకాలు తమ ఆవాసాలను విడిచి బయట సంచరిస్తాయి. ధాన్యపు గాదెలు, గడ్డివాములు, చెట్ల పొదలు, రాళ్ల కుప్పలు, పొలంగట్ల వద్ద ఉన్న రంద్రాల వద్ద ఎలుకలు, తడిగా ఉన్న ప్రాంతాల్లో కప్పలు అధికంగా తిరుగుతుంటాయి. వాటిని తినడానికి కట్ల పాము, నాగుపాము, రక్త పింజర, జెర్రిపోతు, నీరుకట్ట తదితర పాములు అధికంగా సంచరిస్తాయి.
వర్షపు నీటితో పుట్టలు నిండటంతోపాటు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి గాలలుకు అవి బయటకు వస్తాయి. ఆహారం తినడానికి బయటికి వచ్చిన సమయంలో మనుషులు ఎదురైతే అవి దాడి చేసి కాటేస్తాయి. పొలాల వద్ద వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు రైతులు, కూలీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. దుంగలు, కర్రలు, రాళ్లు కదిలించేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. అక్కడ పాములతో పాటుగా తేళ్లు, జెర్రులు ఉండి రైతులను కాటేసే ప్రమాదం ఉంది.
వర్షాకాలంలో విష సర్పాల నుంచి రక్షణ పొందడానికి పొలాల వద్ద పరిశుభ్రతను పాటించాలి. చెత్తాచెదారం, రాళ్లు రప్పలు, ముళ్ల పొదలు, రంద్రాలు లేకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాల వద్ద, పశువుల పాకల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుముట్టు గడ్డి లేకుండా చూసుకోవాలి. చీమలు పుట్టలు, రంద్రాలుంటే వాటిని మూసివేయాలి. లేదంటే వాటి ద్వారా పాములు ఇండ్లలోకి వచ్చే ప్రమాదముంది. ఎప్పుడూ చీకటి కాకుండా తరచూ వెలుగు ఉండేలా చూసుకోవాలి. చీకట్లో వెలుతురు లేకుండా బయటకు వెళ్లడం మంచిది కాదు. బయటకు వెళ్తే పాదరక్షలు తప్పకుండా వేసుకోవాలి. పొలం గట్ల వద్ద నడుస్తుంటే చెప్పులు వేసుకొని టార్చిలైట్ వేసుకొని కర్రను చప్పుడు చేసుకుంటూ వెళ్లాలి. శబ్దంతో పాములు పక్కకు జరిగే అవకాశాలున్నాయి.
పొలాల వద్ద పాములు కాటేస్తే తేలికగా తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది. ముఖ్యంగా నాటు వైద్యాన్ని నమ్ముకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పాతకాలం మాదిరిగా పాము కరిచిన చోట చెట్ల మందులు, ఆకు రసాలు, మంత్రాలు వేయడం మానుకోవాలి. ముఖ్యంగా పాము కరవగానే ఆందోళన చెందకూడదు. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయి. పాము కరువగానే ప్రాథమిక చర్యగా పాము కరిచిన పైభాగంలో తాడుతో, గుడ్డతో కట్టుకట్టాలి. కరిచిన చోట పొటాషియం పర్మాంగనేట్తో కడిగి ఆ భాగంలో ఉన్న రక్తాన్ని పిండి బయటకు తీసి శుభ్రం చేయాలి. గాయం వద్ద వేడి నీటిని పోయడంతో కొంత మేర విషం బయటకు పోతుంది. అనంతరం పాము కరిచిన చోట పటిక ముక్కను ఉంచాలి.
పాము కాటుకు గురైన వ్యక్తి శ్వాసను కోల్పోతే కృత్రిమ శ్వాసను అందించాలి. బాధితుడికి వేడినీళ్లు, కాఫీ, పాలు తాగించాలి. వెంటనే చికిత్స కోసం వీలైనంత త్వరగా దవాఖానకు చేరుకోవాలి. రైతుకు ఏ పాము కరిచిందో స్పష్టంగా చెబితే దానికి తగ్గట్లుగా సరైన వైద్యాన్ని అందించడంతో ప్రమాదం నుంచి ప్రాణాలను త్వరగా కాపాడుకోవచ్చు. పాము కరిచిన చోట రెండు బలమైన కాట్లు పడితే అది విషసర్పంగా గుర్తించాలి. కట్ల పాము కరిస్తే క్షణాల్లోనే విషం రక్త కణాల్లోకి చేరుకుంటుంది.
నాగుపాము కరిస్తే 15 నిమిషాలలోపే విషం శరీరంలోకి చేరుతుంది. 15-20 నిమిషాల్లో దవాఖానకు వెళ్లాలి లేదంటే ప్రాణాలకు ప్రమాదం సంభవించవచ్చును. రక్త పింజర కాటేసిన రెండు గంటల తరువాత విషం శరీరంలోకి ప్రవేశిస్తుంది. జెర్రిపోతు, నీరుకట్ట పాములతో పెద్దగా ప్రమాదం లేకపోయినా చికిత్సమాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. పాము కరువగానే కొన్ని ఆకుల రసాలు పిండి పోస్తారు. ఇది అంత మంచిది కాదని, ఏదేమైనా దవాఖానలో తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాలని వైద్యలు చెబుతున్నారు. దవాఖానలో యాంటీ వీనమ్ సిరం, యాంటి బయాటిక్స్ ఇంజక్షన్లు వేయించాలని పేర్కొంటున్నారు.
పాము కాటుకు గురికాకుండా రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పాము కాటు వేస్తే ఎలాంటి ఆందోళన చెందవద్దు. పాము కాటుతో భయాందోళనకు గురైతే గుండెపోటు వచ్చి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. బాధితుడి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాము కాటును నిర్లక్ష్యం చేయవద్దు. మూఢ నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. పాము కాటు వేసిన వెంటనే వైద్యుడిని ఆశ్రయించి చికిత్స పొందాలి. పాము కాటు వేయగానే ప్రథమ చికిత్స ఎంతో అవసతరం. సకాలంలో బాధితుడిని దవాఖానకు తీసుకొస్తే ప్రమాదం తప్పుతుంది. ముఖ్యంగా వీలైతే ఏ పాము కరిచిందో చెప్పడం లేదా దానిని చంపి దవాఖానకు తీసుకొస్తే మెరుగైన వైద్యం అందించవచ్చు. పాము కాటుకు ప్రభుత్వ దవాఖానల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– రాజ్యలక్ష్మి, మండల వైద్యాధికారిణి, యాచారం