హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ‘మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణతో తమకు ప్రాణహాని ఉన్నది. తమను, తమ కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని క్యాతనపల్లి మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తంచేశారు. వారిద్దరి ప్రోద్భలంతో కాంగ్రెస్ నాయకులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా నేత గొంగిడి సునీత ఆధ్వర్యంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు బుధవారంమహిళా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించారని, బాధ్యులైనా కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరినట్టు తెలిపారు. మున్సిపాలిటీలో 22 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేశారని పేర్కొన్నారు. మంత్రి వివేక్ కనుసైగల్లో అధికారులు పని చేస్తున్నారని కమిషన్‌కు తెలిపారు. మహిళలపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని తెలిపారు. మంత్రి వివేక్ ముందే మహిళా కౌన్సిలర్లపై తాకరాని చోట తాకుతూ మహిళలను ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్యాతనపల్లి సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరితను మంత్రి వివేక్, వంశీకృష్ణ నానారకాలుగా ఇబ్బందులు పెట్టారని తెలిపారు.