కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కష్టకాలం మొదలైంది. ఏడాది కాలంగా జిల్లాలో వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో వానకాలం సాగు జిల్లాలో ఆశించిన స్థాయిలో కాలేదు. గత వానకాలం సీజన్‌తో పోలిస్తే ఈసారి లక్ష ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని రైతాంగం కుదేలైంది. అయితే రైతు భరోసా ఇవ్వకపోవడం.. రుణమాఫీ కాక, పంట రుణాలు అందక తదితర కారణాల వల్ల సాగు తగ్గినట్లు రైతాంగం చెబుతున్నది. బీఆర్ఎస్ పాలనలో గాడినపడ్డ ఎవుసం గాడి తప్పుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
జిల్లాలో వానకాలం పంటల సాగు లెక్కను వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తేల్చుతున్నారు. వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుత వానకాలంలో 3,01,280 ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,51,589 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. సీజన్ ఆరంభం నుంచే పంటల సాగుకు రైతన్నలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. జూన్, జూలై నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో రైతులు అంతంత మాత్రంగానే పంటలను సాగు చేశారు. అత్యధికంగా పత్తిని, ఆతర్వాత వరిని సాగు చేస్తున్నారు. అరకొరగా సాగు చేసిన పంటలు సైతం ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దమొత్తంలో దెబ్బతిన్నాయి.
గత ఏడాది వానకాలంలో నీరు పుష్కలంగా ఉండడంతో 3,47,989 ఎకరాల్లో వివిధ రకాల పంటలను జిల్లా రైతులు సాగు చేశారు. ప్రస్తుత వానకాలంలో అప్పటి పరిస్థితులు లేక అంతంతమాత్రంగానే పంటలను సాగు చేశారు. ఈ నెల 10 వరకు కేవలం 2,51,589 ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. గత సీజన్‌తో పోలిస్తే లక్ష ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గనున్నట్లు తెలుస్తున్నది. వరి సాగు గత సీజన్లో 1.40 లక్షల్లో సాగు కాగా.. ఈసారి 73,450 ఎకరాలే అయింది. గత సీజన్లో పత్తి 1.29 లక్షలు సాగయితే ఈసారి 1.16 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
ఇంకా 50 వేల ఎకరాల్లో వరిని సాగు చేసేందుకు నారుమళ్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వానకాలం సీజన్ ఈ నెలాఖరుతో ముగియనుండడం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో మిగిలిన వరి సాగును చేపట్టే సాహసాన్ని రైతులు చేయలేకపోతున్నారు. మరోపక్క ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంపైననూ రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా.. ఈసారి వానకాలంలో సాగు విషయంలో అంచనాలు తలకిందులయ్యాయని రైతాంగం ఆందోళన చెందుతున్నది.
జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మూడు విడుతల్లో కలిసి జిల్లాలో 87,612 మందికి రూ.660.72 కోట్లను మాఫీ చేసింది. నేటికీ రుణమాఫీ ప్రక్రియ జిల్లాలో అసంపూర్ణంగానే ఉన్నది. చాలామంది రైతులు రుణాలను ఏండ్ల తరబడిగా చెల్లించకపోవడంతో మొండి బకాయిదారులుగా మారారు. దీనికితోడు రుణమాఫీ సైతం కాకపోవడంతో వారికి కొత్తగా రుణాలు అందే పరిస్థితి లేకుండా పోయింది.
రుణమాఫీ అయిన తర్వాతే కొత్త రుణాలు ఇస్తామంటూ బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో పెట్టుబడులకు జిల్లా రైతాంగం గోస పడుతున్నది. ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు వానకాలం పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సాయం పెట్టుబడులకు అక్కరకు వచ్చేది. సీజన్ ముగియవస్తున్నప్పటికీ రైతు భరోసా సాయం లేకపోవడంతో రైతులు పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగం వానకాలంలో అరకొరగానే పంటల సాగు చేపట్టింది.