జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతలు కుంటలను తలపిస్తున్నాయి. ఇక గ్రామాలు, తండాల్లో అయితే రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కిలోమీటర్ల మేర దారులు బురదతో నిండిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
ప్రధానంగా వికారాబాద్-మోమిన్‌పేట, మోమిన్‌పేట-మర్పల్లి, వికారాబాద్-కోట్‌పల్లి, బొంరాస్‌పేట నుంచి గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే దౌల్తాబాద్ మండలం, తాండూరు-పెద్దేముల్, మోమిన్‌పేట్-శంకర్పల్లి రహదారుల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ పరిస్థితి అలాగే ఉన్నది.
పాడైన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఏడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయలేదని వాహనదారులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు.
– వికారాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ)



