MMTS | ముందు పాత రైళ్లు, సర్వీసులను రద్దు చేస్తారు. మళ్లీ కొన్నాళ్లాగి కొత్త రైళ్లంటూ, సర్వీసులంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత ఊదరగొడతారు. ఇక అక్కడి నుంచి అన్నీ కొత్త సర్వీసులేనంటూ ఉధృతంగా ప్రచారం మొదలు పెడతారు. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా జెండా ఊపి ప్రారంభించిన ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసుల తీరు అయోమయంగా మారింది. జంట నగరాల ప్రయాణికుల అవసరాల కోసం మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో అందుబాటులోకి తీసుకువచ్చిన మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ (ఎంఎంటీఎస్) లోకల్ రైలు సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సంస్థ పాత రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసులను తగ్గించి, వీటినే కొత్త రూట్లలో ఏర్పాటు చేసినట్లు చూపించడం గమనార్హం.
ఫేజ్-1లో తగ్గించి..వీటినే కొత్త మార్గాల్లో…
ఎంఎంటీఎస్ ఫేజ్-1 మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మొత్తం 130 సర్వీసులను నడిపించాలని గతంలోనే ఎస్సీఆర్ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే శాఖకు లాభాలు రావడం లేదని, ప్రయాణికులు లేరన్న సాకుతో ప్రస్తుతం 60 నుంచి 80 సర్వీసులను మాత్రమే నడుపుతున్నారు. జంటనగరాల ప్రయాణికుల అవసరాల కోసం ఫేజ్-1 రైల్వే స్టేషన్ల మధ్య నడిపించాల్సిన ఎంఎంటీఎస్ సర్వీసుల్లో కోత విధించింది. వీటినే కొత్త మార్గాలైన మేడ్చల్-సికింద్రాబాద్, ఫలక్నుమా నుంచి ఉందానగర్ వరకు పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ రైలు సర్వీసులను స్వయంగా ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించినప్పటికీ వాటిని కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య నడిచే ఎంఎంటీఎస్ సర్వీసుల పనితీరును తనిఖీ చేస్తున్న తీరును ప్రయాణికులు తప్పుబడుతున్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-1లో సర్వీసులను పెంచకుండా.. అక్కడ తగ్గించి, కొత్త మార్గంలో నడిపించడం ఎంత వరకు సమంజసం అన్న విమర్శలు ప్రయాణికుల నుంచి వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా పనుల్లో ఆలస్యం..
ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు నిధులు గత ఏడాదిలో వ్యవధిలోనే సకాలంలో రూ.200 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రం నుంచి ఇంకా నిధులు విడుదల కావడం లేదంటూ ఎస్సీఆర్ జోనల్ అధికారులు బుకాయించడం హాస్యాస్పదంగా ఉంది. కాని ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ర్టాల్లో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడంలో నిరంతరం పనులు కొనసాగుతున్నట్లు రైల్వే ఉద్యోగ సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టులు పనులు కూడా రైల్వే అధికారులు నత్తనడకన కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జంట నగరాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.