వికారాబాద్, ఆగస్టు 1 : స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై గురువారం ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంపై అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలో ఐదురోజులపాటు జరుగనున్న ఈ ప్రోగ్రాంలో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించాలన్నారు. స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించి అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లలో పారిశుధ్య పనులతోపాటు, ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేయించాలన్నారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్ వేసి దోమల వృద్ధిని అరికట్టాలన్నారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై విద్యార్థులకు వ్యాసరచన, పద్య గేయాల పోటీలు నిర్వహించి బహుమతులను ఇచ్చి ప్రోత్సహించాలని కలెక్టర్ డీఈవోకు సూచించారు.
వన మహోత్సవం కింద గ్రామపంచాయతీలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ నిమిత్తం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలన్నారు. కుక్కల బెడద ఉన్న ప్రాంతాలను గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సుధీర్, ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో జయసుధ, డీఈవో రేణుకాదేవి,డీఎంహెచ్‌వో పల్వన్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్ , పశు సంవర్ధక శాఖ అధికారి పూర్ణచంద్రరావు, ఆర్ అండ్‌బీ ఇన్చార్జి ఈఈ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ రవికుమార్, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు