రంగారెడ్డి, మే 30(నమస్తే తెలంగాణ) : ప్రస్తు త విద్యా సంవత్సరంలో బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బడిబాట కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూన్ 3 నుంచి 11 వరకు చేపట్టనున్న బడిబాట, జూన్ 12 నుంచి 19 వరకు రోజువారీగా చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తహసీల్దార్ల్లు, ఎంపీపీలు, ఎంపీవోలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులను, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సెక్రటరీలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. తమ పరిధిలోని గ్రామాలలో చదువుకు దూరంగా ఉంటున్న బడీడు పిల్లలను గుర్తించి దగ్గరలోని అంగన్వాడీలు, పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించి, ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమమన్న నమ్మకాన్ని తల్లిదండ్రులలో కలిగించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు కల్పిస్తూ డ్యూయల్ డెస్లు, డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు, శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు.
విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్, యూనిఫాంలతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తున్న విషయాన్ని సమగ్రంగా వివరించాలన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న వారే ఉన్నత స్థానాలలో ఉన్నారన్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. జూన్ 3న బడిబాట కార్యక్రమంపై విలేజి ఆర్గనైజేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. 4న ఇంటింటికీ తిరిగి బడీడు పిల్లలను గుర్తించాలన్నారు. 5 నుంచి 10 వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తలిదండ్రుల్లో చదువుపై అవగాహన కల్పించి పిల్లలను బడికి పంపేలా చూడాలన్నారు. 11న గ్రామ సభ ఏర్పాటు చేసి 3 నుంచి 10 వరకు చేపట్టిన కార్యక్రమాలపై చర్చించాలన్నారు. 12న పండుగ వాతావరణంలో పాఠశాలు పునః ప్రాంరంభించి నూతన విద్యార్థులకు స్వాగతం పలకాలన్నారు. 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, 18న డిజిటల్ తరగతులపై అవగాహన, 19న ఆటలపోటీలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఈవో సుశీందర్ రావు, డీఆర్డీఏ పీడీ శ్రీలత, వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు, డీపీవో సురేశ్ మోహన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.