Madugula | మాడుగుల : వంతెనను నిర్మించాలంటూ మహిళలు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మహిళలు డిమాండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరు అందుగుల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రాకపోకలకు ఇబ్బందికరంగా అందుగుల వాగు మారిందని.. దాన్ని ఒకసారి పరిశీలించాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేలను కోరారు. అయితే వాగును చూసేందుకు వెళ్లి.. మధ్యలోనే వెనుదిరిగారు. దాంతో ఆగ్రహానికి గురైన మహిళలు నేతలపై మండిపడ్డారు. వాగుపై వంతెన నిర్మించాలంటూ కారుని అడ్డగించారు. కొంతమంది మహిళలు రైతుభరోసా వేయడం లేదని ఆరోపించారు.
ఓ మహిళ ఎమ్మెల్యే సార్ మా గ్రామాన్ని చూసేందుకు వచ్చావా?.. ఏం చేస్తుంది మీ ప్రభుత్వం అంటూ నిలదీశారు. దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎంపీ మల్లు రవి కారులోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలాగే, ఇర్విన్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన నేతలకు సైతం చుక్కెదురైంది. గ్రామస్తులు గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని కోరారు. రిజర్వాయర్ను రద్దు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని ఎంపీ, ఎమ్మెల్యేల ఎదుట నిరసన తెలిపారు. పోలీసుల సహకారంతో నేతలు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.
Madugula
Madugula
Madugula