అబిడ్స్, ఫిబ్రవరి 25 : ఆస్తి పన్ను చెల్లింపు గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతుండటంతో జీహెచ్ఎంసీ సర్కిల్-14 కార్యాలయ అధికారులు పన్ను వసూళ్లను వేగిరం చేశారు. ఇందులో భాగంగా లక్షకు పైగా ఆస్తి పన్ను బకాయి పడిన వారి నుంచి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సర్కిల్ పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ భవనాలు ఉండగా ఆయా భవనాల ఆస్తి పన్ను వసూలు చేసేందుకు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే డిమాండ్ నోటీసులు జారీ చేసి స్పందించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందిని రంగంలోకి దింపి పన్ను వసూలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు 90 కోట్ల టార్గెట్ విధించగా ఇప్పటికే యాభై కోట్ల వరకు ఆస్తి పన్ను వసూలు చేశారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ ధోత్రే పర్యవేక్షణలో సర్కిల్-14 డిప్యూటీ కమిషనర్ ఎస్ విద్యాధర్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బీఎల్వోలతో సమావేశాలు నిర్వహించి ఆస్తి పన్ను వసూలు టార్గెట్ పూర్తి చేసేందుకు పాటు పడుతున్నారు.
నగరాభివృద్ధికి ఆస్తి పన్ను చెల్లించండి
నగరాభివృద్ధికి ఆస్తి పన్ను బకాయి పడిన వారు అపరాధ రుసుము లేకుండా గడువులోపు చెల్లించాలి. సర్కిల్-14 పరిధిలో ఆస్తి పన్ను బకాయి పడిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి గడువు లోపు ఆస్తి పన్ను చెల్లింపులు జరిగేలా చూస్తున్నాం.
-ఎస్ విద్యాధర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్