వికారాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రైవేట్ డీలర్లు ఎరువుల విక్రయంలో దోపిడీకి పాల్పడుతున్నారు. డీఏపీ కొరతను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దండుకుంటున్నారని రైతులు ఆరోపిస్తు న్నారు. ఒక్కో బ్యాగుపై రూ. 100 వరకు అధికంగా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రభుత్వం ఒక్కో బ్యాగు డీఏపీ ధరను రూ.1,350గా నిర్ణయించగా ప్రైవేట్ డీలర్లు మాత్రం రూ.1,420 నుంచి రూ.1,450 లకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేట్ డీలర్లు అధిక ధరకు డీఏపీని విక్రయిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతోనే వారి ఆటలు సాగుతున్నాయని.. ఇష్టారాజ్యంగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీఏపీతోపాటు 20-20 మసాలా ఎరువు కూడా కొనాలని రైతులకు బలవంతంగా అంటగట్టుతున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు విత్తనాలను నాటేందుకు సిద్ధమైన రైతులు ఏమీ చేయలేని పరిస్థితిలో డీలర్లు చెప్పిన రేట్‌కే ఎరువులను కొంటున్నారు.
జిల్లాలో వర్షాలు ప్రారంభమై అన్నదాత సాగుకు సన్నద్ధమైనా ప్రభుత్వం మాత్రం ఎరువులు, విత్తనాలను సమకూర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. విత్తనాలు నాటేందుకు అవసరమయ్యే డీఏపీ ఎరువు స్టాక్ జిల్లాకు కేవలం పది శాతం మాత్రమే వచ్చింది. వచ్చింది.. వచ్చినట్లు అయిపోవడంతో డీఏపీ కొరత ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు విత్తనాలను నాటేందుకు సిద్ధమైన అన్నదాతకు ఎక్కడికెళ్లినా డీలర్లు డీఏపీ లేదని చెబుతున్నారు. డీఏపీ కోసం రైతులు జిల్లా అంతటా డీలర్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే డీఏపీ కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనే ప్రమాదమూ లేకపోలేదు. జిల్లాలో వానకాలానికి 27,000 మెట్రిక్ టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేయగా.. ఇప్పటివరకు కేవలం 2,609 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. మిగతా స్టాక్ ఎప్పుడు వస్తుందనేది సంబంధిత శాఖ అధికారులకు కూడా చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా జిల్లాకు యూరియా 39,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటివరకు 8,263 మెట్రిక్ టన్నులు మాత్రమే రాగా.. పోటాషియం 8,000 మెట్రిక్ టన్నులకుగాను 175 మెట్రిక్ టన్నులు మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉన్నది.
ఎరువులను అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. డీఏపీ, యూరియా తదితర ఎరువులను ఎంఆర్పీకే విక్రయించాలి. డీలర్లు ఎక్కువ ధరకు అమ్మినట్లు రైతులు వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే జిల్లాకు డీఏపీ స్టాక్ వస్తుంది.
– మోహన్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి