వికారాబాద్ : డెంగ్యూను అరికట్టడం(Dengue Prevention) అందరి బాధ్యత ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ( DMHO Dr. Venkata Ramana) తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా మలేరియా నియంత్రణ అధికారి రవీంద్ర యాదవ్ తో కలిసి డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వాసుపత్రి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కొనసాగింది.
డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 16 న జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటామని, జిల్లా లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ అవగాహనా ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 2030 నాటికి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నిర్ములించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.
ప్రజలలో ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరగడం వల్ల గ్రామాలు, పట్టణాలలో పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపడ్డాయని అన్నారు. దీంతో డెంగ్యూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు. డెంగ్యూ వ్యాధిని వ్యాపింప చేసే దోమల పెరుగుదలను అరికట్టడానికి నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గ్రామాలు, పట్టణాలలో ఫాగింగ్ చేయడం , నీటి నిల్వ గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయడం , గంబుషియా చేపలను వదలడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని వివరించారు. ఈ అవగాహన ర్యాలీలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ సృజన, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారి మహేష్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రకాష్ , సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాలొన్నారు.