వికారాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు మూడు నెలల్లో పూర్తైయ్యే అవకాశాలు లేకపోవడంతో అనంతగిరిలోని టీబీ శానిటోరియంలో తాత్కాలికంగా తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీబీ శానిటోరియంలో ఏడాదిపాటు తరగతులను నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు తరగతుల నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకోసం రూ. ఎనిమిది కోట్ల నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
మార్చిలోపు టీబీ శానిటోరియంలో మెడికల్ కళాశాల తరగతుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసేందుకు చర్యలను ముమ్మరం చేశారు. అయితే వికారాబాద్ ప్రభుత్వ దవాఖానను మెడికల్ కాలేజీకి అనుబంధ బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందు కు ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ బోధనాస్పత్రిని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీఎస్ఎంఐడీసీ అధికారులు పనులను శరవేగంగా చేపడుతున్నారు. అయితే వికారాబాద్‌లో వంద పడకల ఏరియా దవాఖానను 380 పడకలతో బోధనాస్పత్రిగా అందుబాటులోకి తెచ్చేందుకు రూ.30 కోట్లతో ఏరియా దవాఖానపై మరో రెండస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే 100 సీట్లతో జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేయడంతోపాటు మెడికల్ కాలేజీ నిర్మాణం, దవాఖాన అప్‌గ్రేడ్, పరికరాలు, ఫర్నిచర్ తదితరాల కొనుగోలు నిమిత్తం ఇప్పటికే రూ.235 కోట్లను కేటాయించింది.
జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడంతో ప్రస్తు తం ఉన్న వికారాబాద్ ఏరియా దవాఖానను బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియ శరవేగంగా సాగు తున్న ది. వైద్య కళాశాల ఏర్పాటుతో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుతం 12 రకాల వైద్యసేవలు కొనసాగుతుండగా, బోధనాస్పత్రిగా అప్‌గ్రేడ్ అయితే 20కిపైగా వైద్యసేవలు జిల్లావాసులకు అందనున్నాయి. అంతేకాకుండా ఐసీయూ, ట్రామా కేంద్రాలూ అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు ఇప్పటికే రెగ్యులర్ పోస్టుల్లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యా బ్ టెక్నీషియన్, స్టోర్ కీపర్, చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్, గ్రేడ్-1, 2 సీనియర్, జూనియర్ రెసిడెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, టీబీ అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, హెల్త్ ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్టు, మేల్నర్సింగ్, బ్లడ్‌బ్యాంక్ అధికారి పోస్టు లు మంజూరైన దృష్ట్యా సంబంధిత సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారుతాయి. ప్రజలకు ప్రభుత్వపరంగా నాణ్యమైన వైద్యసేవలు అందనున్నాయి. తద్వారా ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినా, ఇతర అత్యవసర వైద్య సేవలను పొందాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పనున్నది.
వికారాబాద్ జిల్లాకు ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు కాగా వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు శాశ్వత మెడికల్ కళాశాల భవనం 2024లోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలను ము మ్మరం చేశారు. అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అనంతగిరిలోని వైద్యారోగ్యశాఖకు సంబంధించిన స్థలంతోపాటు ఎస్ఏపీ కాలేజీ సమీపంలోని బిల్లా దాఖలా స్థలం వివరాలను ప్రభుత్వానికి అందజేయగా.. ప్రభుత్వం అనంతగిరిలోని వైద్యారోగ్యశాఖకు సంబంధించిన టీబీ శానిటోరియం స్థలాన్నే దాదాపుగా ఖరా రు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనంతగిరిలో ని అనంతపద్మనాభస్వామి ఆలయం ముందు భాగంలోనే మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చేపట్టే అవకాశాలున్నాయి. సంబంధిత భూములు వైద్యారోగ్య శాఖకు సంబంధించినవే కావడంతో ఆ స్థలాన్ని ఫైనల్ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.