Nandigama | నందిగామ, మార్చి24 : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మోత్కూలగూడ గ్రామానికి చెందిన రైతు వనరసి నర్సింహాకు 3.20 ఎకరాల భూమి ఉంది. రెండు ఎకరాల్లో మక్కజొన్న పంట, మిగతా పొలంలో చిక్కుడు, టమాటా, మిర్చి పంటలను సాగు చేశారు. కరెంట్ సరిగ్గా రాకపోవడం ఒకవేళ వచ్చిన లో వోల్టేజితో రావడంతో మోటార్లు కాలిపోవడంతో పాటు పంటలకు నీరు అందక కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోతున్నాయని, చేసేది ఏమి లేక మక్కా, టమాటా, చిక్కుడు పంటను పశువులను మేపుతున్నానని రైతు నర్సింహా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే నాలుగు కొత్త బోర్లు వేసిన చుక్క నీరు రాలేదని, ఉన్న బోరు ఇప్పటికి మూడు సార్లు కాలిపోయిందని బోర్లు వేయడానికి, మోటార్లు కట్టించడానికి నేను వేసిన పంటలకు మొత్తం రూ.4 లక్షల వరకు అప్పులు చేశానని చేసిన అప్పులు ఎలా కట్టాలో అర్ధం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నానని, కేసీఆర్ ప్రభుత్వం ఉండగా కరెంట్ మంచిగా వచ్చేదని, అస్సలు లో వోల్టేజి సమస్య లేకుండా 24 గంటలు కరెంటు వచ్చేదని, రైతు బంధు కూడా సమయానికి వచ్చేదని, కాంగ్రెస్ వచ్చాక కరెంట్ లేదు, రైతు బంధు లేదని, రైతులకు కన్నీరే మిగిలిందని రైతు నర్సింహా ఆవేదన వ్యక్తం చేశారు.