వికారాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కరెంట్ కోతలు పెరిగాయి. ఎండల తీవ్రత పూర్తిగా పెరగక ముందే షురూ అయ్యాయి. మొన్నటి వరకు కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే కరెంట్ కోతలను విధించిన విద్యుత్తు శాఖ ప్రస్తుతం వాటిని పెంచింది. జిల్లాలో గత పది రోజులుగా ఏడు గంటలపాటు అధికారికంగా కోతలు విధిస్తున్నది. అర్ధరాత్రి దాటిన తర్వాతే త్రీఫేజ్ కరెంట్‌ను ఇస్తున్నారు. సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అధికారికంగా వ్యవసాయానికి సరఫరాలో కోత విధిస్తున్నట్లు సబ్స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లు పేర్కొంటున్నారు. జిల్లాలోని కొడంగల్, తాండూరు నియోజకవర్గాలు మినహా మిగతా రెండు నియోజకవర్గాల్లో వ్యవసాయానికి ఏడు గంటలపాటు అధికారికంగా పవర్ కట్ చేస్తున్నారు.
ఓ వైపు ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటు తుండడంతోపాటు పవర్ కట్స్‌తో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటకు నీరు పెట్టేందుకు కరెంట్ ఎప్పుడొస్తుందోనని రైతులు పొలాల వద్దే పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అర్ధరాత్రి తర్వాతే త్రీ ఫేజ్ కరెంట్ సరఫరా అవుతుండడంతో వరికి నీరు పెట్టేందుకు రైతులు రాత్రంతా పొలాల్లోనే జాగారం చేస్తున్నారు. మరోవైపు గృహ వినియోగానికి కూడా విద్యుత్తు కోతలు పెరిగాయి. గత కేసీఆర్ హయాంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్తు సరఫరా కాగా..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహ వినియోగానికి సంబంధించి పట్టణాలతోపాటు గ్రామాల్లో రోజుకు 10-15 సార్లు పవర్ కట్స్ జరుగుతున్నాయి.
రైతులకు కరెంట్ కష్టాలు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన విధంగానే రేవంత్ ప్రభుత్వం రాగానే పవర్ కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక కోతలు కొనసాగుతున్నాయి. అధికారికంగా 8 గంటలపాటు కోతలు విధిస్తుండగా.. ఓ సమయమంటూ లేకుండా మిగతా సమయాల్లోనూ అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట కరెంట్ కట్ చేస్తున్నారు. అంతేకాకుండా డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు లేకపోవడంతో త్రీఫేజ్ సరఫరా వేళల్లోనూ కోతలు విధిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల్లపాటు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి కోతలు మొదలయ్యాయి.
ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటిపోతున్న భూగర్భజలాలకు తోడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వరి తదితర పంటలకు ఉన్న నీటిని కూడా అందించలేకపోతున్నారు. కరెంట్ కోతలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను జిల్లా రైతాంగం గుర్తు చేసుకుంటున్నది. నాడు అర్ధరాత్రి 2-3 గంటలపాటు కరెంట్‌తో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఎంతో మంది విద్యుదాఘాతాలతో మృత్యువాత పడడంతోపాటు చాలామంది పంట పొలాలకు నీరు పెట్టేందుకు మోటర్లు ఆన్ చేయబోయి విద్యుత్తు షాక్, పాము కాటుతో మృతిచెందారు. మరోవైపు జిల్లాలో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం, పరిశ్రమలకు ప్రతిరోజూ ప్రస్తుతం సుమారు 8 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, జిల్లాలో దాదాపు 80 వేల వ్యవసాయ కనెక్షన్లున్నాయి.
కోతలతో పంటలు పండేది కష్టమే..
విద్యుత్తు కోతలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండే. కానీ, నేడు రాత్రి సమయంలో వ్యవసాయానికి సక్రమంగా ఇవ్వడం లేదు. రాత్రి పగలు సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులకు తమ పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందిపడు తున్నా రు. కరెంట్ కోతలు ఇలాగే ఉంటే పంటలు పండేది కష్టమే.
– గండి లక్ష్మణ్, చాపలగూడెం కులకచర్ల
అన్నదాతలు ఆగమవుతున్నారు..
ప్రభుత్వం పంటలకు సక్రమంగా విద్యుత్తును అందించాలి. లేకుంటే అవి నీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఎండలు పూర్తిగా ముదరక ముందే అప్రకటిత కోతలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. రైతన్న కష్టం వృథా కాకుండా సరిపడా విద్యుత్తును అందించి ఆదుకోవాలి.
-చాకలి అంజిలయ్య, బొంరెడ్డిపల్లి, కులకచర్ల
ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్నాం
రోజురోజుకూ పెరుగుతున్న కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. చీటికి, మాటికి కరెంట్ పోవడంతో బల్బులు కాలిపోతున్నాయి. ఉక్కపోతతో ఇం ట్లో ఉండలేని పరిస్థితి నెలకొన్నది. గాలి వీచినా.. వర్షం కురిసినా గంటల తరబడి కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. ప్రభుత్వం, విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
-ఎస్.నర్సింహులు, ఇబ్రహీంపల్లి(చేవెళ్ల టౌన్)
సాయంత్రం ఆరు దాటితే వ్యవసాయానికి విద్యుత్తు కట్..
రంగారెడ్డి, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వరి పొట్ట దశలో ఉండడంతో నీరు ఎంతో అవసరం. కాగా, ప్రభుత్వం సాయంత్రం ఆరుగంటలు దాటితే సింగిల్‌ఫేజ్ కరెంట్‌నే సరఫరా చేస్తున్నది. అర్ధరాత్రి ఒకటి తర్వాతే త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తుండటంతో రైతులు పొలాల వద్దనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయానికి సుమారు ఆరుగంటలకుపైగా కోత లు విధిస్తున్నది. అలాగే, మధ్యా హ్నం సమయంలోనూ అప్రకటిత కోతలు కొనసాగుతూనే ఉన్నాయి.
జిల్లాలో 1,25,000 ఎకరాల్లో వరిసాగు
జిల్లాలో యాసంగిలో 1,25,000 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. అలాగే, కూరగాయలు, ఇతర తోటలనూ సాగు చేయగా వాటికి కూడా కరెంట్ తప్పనిసరి. ప్రస్తుతం వరి పంట పొట్ట దశకు చేరుకోవడంతో నీరు చాలా అవసరం. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, షాద్‌నగర్, ఫారుక్‌నగర్, నందిగామ, కేశంపేట, కొత్తూరు, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్ వంటి మండలాల్లో వరి సాగు గణనీయంగా ఉన్న ది. సాగునీరు ఎక్కువగా వాడే సమయంలో కరెంట్ కోతలు విధిస్తుండడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యుత్తు వినియోగం పెరగడంతో మోటర్లు పనిచేయక రైతులు తీవ్రంగా నష్టపోవల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇండ్లకూ తప్పని కోతలు..
జిల్లాలో గృహావసరాలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం కావడంతో ఏసీలు, కూలర్లు,. ఫ్రిజ్‌ల వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్తు అధికారులు గృహావసరాల కోసం సింగిల్ఫేజ్ను సరఫరా చేస్తున్నా అనధికారిక కోతలు విధిస్తున్నారు. గాలి వీచినా.. వర్షం కురిసినా..అలాగే విద్యుత్తు లైన్ల పునరుద్ధణ పేరుతో గంటల తరబడి విద్యుత్తును నిలిపివేస్తున్నారు. మరోవైపు రాత్రిపూట కూడా అనధికార కోతలు విధిస్తుండడంతో గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, సింగిల్‌ఫేజ్ కరెంటుతో పరిశ్రమల్లో ఉన్న మోటర్లు పనిచేయకపోవటంతో పలు పరిశ్రమలు మూతపడే పరిస్థితులున్నాయి.
బీఆర్ఎస్ పాలనలో బాగుండే..
గత బీఆర్ఎస్ హయాంలో గృహాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా జరిగింది. కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాక గృహాలకు కష్టాలు తప్పడంలేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడంలేదు. ప్రభుత్వం స్పందించి సక్రమంగా సరఫరా చేయాలి. -కొమ్ము ప్రసాద్, ఆమనగల్లు మున్సిపాలిటీ
ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు
మండలంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఉదయం వేళలో లోవోల్టేజీతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ సమస్య లేకుండే. పలు రకాల వ్యా పారాలు చేసుకునే వారు నిత్యం సతమవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి విద్యుత్తు సమస్యను పరిష్కరించాలి.
-భూతరాజు నాగరాజు, యాచారం
అప్రకటిత కోతలతో ఇబ్బంది..
ఎండలు ముదరకముందే కరెంట్ ఎప్పుడు వస్తుం దో.. పోతుంతో తెలియని పరిస్థితి నెలకొన్నది. కడ్తాల్ గ్రామంలో వ్యవసాయానికి త్రీ ఫేజ్‌ను ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు తీసివేసి.. అర్ధరాత్రి 12:30 గంటలకు వదులుతున్నారు. అది కూ డా నిర్ణీత సమాయానికి రావడంలేదు. పగటి పూట కరెంట్ ఉండటం లేదు. అప్రకటిత కోతలతో వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ఇబ్బందికరంగా మారింది. -జీ గణేశ్‌యాదవ్, కడ్తాల్
వ్యవసాయానికి సక్రమంగా సరఫరా చేయాలి
వ్యవసాయానికి విద్యుత్తును సక్రమంగా సరఫరా చేయాలి. చాలీచాలని సరఫరాతో పంటలు ఎండిపోతున్నాయి. కరెంట్ కోసం రాత్రిపూట పొలాల వద్ద జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. గత కేసీఆర్ పాలనలో ఈ సమస్య లేకుండే. ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
-లోహిత్‌రెడ్డి రైతు, కొత్తపల్లి యాచారం
రైతులు నష్టపోతారు..
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి సక్రమంగా కరెంట్ ఇవ్వడంలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం రైతుల కు 24 గంటల కరెంట్‌ను సరఫరా చేసింది. ఈ ప్ర భుత్వం వచ్చినంకా 14 గంటల కరెంటే ఇస్తున్నది. అందులోనూ పలుమార్లు అంతరాయం కలుగు తున్నది. పంటలు చేతికొచ్చే సమయంలో కోతలు విధిస్తే రైతుల నష్టపోయే అవకాశమున్నది. పెట్టిన పెట్టుబడి కూడా రాదు.
-పి. కుమార్, రైతు కుమ్మరిగూడ(షాబాద్)
కోతల్లేకుండా సరఫరా చేయాలి
ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉన్నది. ఈ పంటకు ఇప్పుడు సరిపడా నీరు అవసరం. ప్రభుత్వం వేళాపాళా లేకుండా విద్యుత్తును సరఫరా చేస్తే ఆ పంట మొత్తం ఎండిపోయే ప్రమాదం ఉన్నది. అన్నదాతలు అప్పులు తీసుకొచ్చి పంటను సాగుచేశారు. పంట ఎండిపోతే పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బంది పడుతారు. కోతలు లేకుండా కరెంట్‌ను సరఫరా చేస్తే అందరికీ బాగుంటుంది.
– కాకునూరు కృష్ణ, రైతు, కొత్తపేట
రైతులు పొలాల వద్దే ఉంటున్నారు..
కేసీఆర్ పాలనలో ఇండ్లతోపాటు వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా నిరంతరంగా ఉండేది. ప్రస్తుత వేసవిలో ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియడంలేదు. అర్ధరాత్రి త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తుండడంతో అన్నదాతలు పొలాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోకుండా విద్యుత్తును అందించి ఆదుకోవాలి.
– కుంటి లక్ష్మయ్య, రైతు, కొత్తపేట