Tanduru | తాండూరు రూరల్, మే 3 : తాండూరు మండలంలో ట్రాన్స్కో అధికారులు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తుండడంతో పగటిపూట ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అదేవిధంగా తాండూరు చుట్టూ ఉండే స్టోన్ వ్యాపారులకు, కార్మికులు, లోడింగ్, ఆన్లోడింగ్ కూలీలకు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులు ఇష్టారీతిన కోతలు విధిస్తుండడంతో గృహాల్లో ఉండే వారు ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ కోత విధించారు. అదేవిధంగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. చిన్నాపాటి చిరు జల్లులు కురిస్తే చాలా కరెంట్ కట్ చేస్తారు. ఇదేమని ప్రశ్నిస్తే పై నుంచి కరెంట్ లేదు అనేసమాధానం లైన్మెన్, ఏఈల నుంచి వస్తోంది.
స్టోన్ వ్యాపారులకు, కార్మికుల, రోజుకూలీల ఆర్థిక ఇబ్బందులు
మండల పరిధిలోని గౌతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో 1,000కి పైగా స్టోన్ పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. కరెంట్ కోతల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరో వైపు పాలిషింగ్ యూనిట్లలో పని చేసే కార్మికులతోపాటు లారీల్లో నాపరాయిని లోడింగ్, ఆన్లోడింగ్ చేసే కూలీ పనులు మందగించాయి. దాంతో తమకు సరిపడ కూలీ డబ్బులు రావడం లేదని కార్మికులు ఆందోళనలో ఉన్నారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు, వ్యాపారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోన్నది. ఉన్నతాధికారులు స్పందించి కరెంట్ కోతలు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.