షాద్‌నగర్‌రూరల్, మే 13: గత బీఆర్ఎస్ హయాంలో వేసవిలో సైతం 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా అందించింది. దీంతో నాడు వ్యాపారస్తులకు, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు (Power Cuts) సమస్య ప్రజలకు తలనొప్పిగా మారింది. విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి షాద్‌నగర్ పట్టణంలో దాపరించింది.
సమయపాలన, ముందస్తు సమాచారం లేకుండా అప్రకటిత విద్యుత్ కోతలతో వ్యాపారస్తులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం దీనికి తోడు విద్యుత్ సమస్య తలెత్తడంతో ప్రజలు ఉక్కపోతను భరించలేకపోతున్నారు. బయటకు వెళ్దామంటే భానుడి భగ..భగ ఇంట్లో సేదతీరుదామంటే విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పట్టణంలో చాలా మేరకు విద్యుత్ వినియోగంతో వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అప్రకటిత విద్యుత్‌కోతలతో తమ వ్యాపారాలు అంతంత మాత్రమే నడుస్తున్నాయని, దీంతో కిరాయి కట్టలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాలలోని రైతుల గోస దేవుడికే ఎరుక అనే విధంగా మారింది. విద్యుత్ వస్తూ పోతూ ఉండడంతో మోటర్లు కాలిపోయి రైతన్నలు అవస్థలు పడుతున్నారు. మోటర్లను రిపేరింగ్ చేయించేందుకు పట్టణంలోని మోటర్ దుకాణాల వద్దకు రైతులు క్యూ కడుతున్నారు.
విద్యుత్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం..
కొన్ని రోజులుగా డీటీపీ, ఆన్లైన్ సెంటర్‌తో జీవనోపాధి పొందుతున్నానని షాద్‌నగర్‌కు చెందిన రమేష్ అన్నారు. ఇటీవల అప్రకటిత విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కష్టమర్లకు ఆన్లైన్ సర్వీసులు అందించలేకపోవడంతో తిరిగి వెళ్లిపోతున్నారు. దీంతో కనీసం కిరాయి కట్టలేని పరిస్థితి. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తే బాగుటుంది.
సమస్య తలెత్తకుండా చూస్తాం..
విద్యుత్ సమస్య లేకుండా చూస్తాం. సాధ్యమైనంత వరకు నిరంతరం విద్యుత్ అందించేలా చూస్తున్నామని విద్యుత్‌శాఖ పట్టణ ఏఈ వినోద్ చెప్పారు. షాద్‌నగర్ సబ్‌స్టేషన్‌లో సరిపడ మ్యాన్‌పవర్ లేదని, ప్రైవేట్ వ్యక్తులతో పనులు కొనసాగుస్తున్నామని చెప్పారు.