వికారాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని చెరువులు, ప్రాజెక్టులు కబ్జాకు గురయ్యాయి. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపాలిటీల్లోని చెరువులను కొందరు యథేచ్ఛగా చెరపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి చెరువులను అభివృద్ధి చేస్తే, వాటి హద్దులను గుర్తించాల్సిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని ఆక్రమణదారులు వికారాబాద్, పరిగి, తాం డూరు మున్సిపాలిటీల పరిధిలోని పలు చెరువులను కబ్జా చేసి, పలు భవనాలను నిర్మించారు.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతోపాటు వ్యవసాయానికి నీరందించే చెరువులను ఆక్రమించారు. కొన్నేండ్లుగా చెరువుల ఆక్రమణ జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా చెరువులను ఆక్రమించిన ప్రాంతా ల్లో రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లు, ఇండ్ల నిర్మాణాలకు గ్రామపంచాయ తీ, ఆయా మున్సిపాలిటీల అధికారులు అనుమతులు ఇస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో హైడ్రా.. చెరువులు, కుంటల్లోని కబ్జాలకు చెక్ పెడుతూ ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండడంతో జిల్లాలో చెరువులను ఆక్రమించుకున్న వారి గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలోని చెరువులను కాపాడేందుకు ‘హైడ్రా’ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లావాసులు కోరుతున్నారు.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివసాగర్, సర్పన్‌పల్లి, కొంపల్లి చెరువులు, ప్రాజె క్టులు కబ్జాకు గురయ్యాయి. ప్రధానంగా మిషన్ భగీరథకు ముందు వికారాబాద్ మున్సిపాలిటీకి తాగు నీరందించే శివసాగర్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు అన్యాక్రాంతమయ్యాయి. శివసాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే పట్టా భూమంటూ ఓ ఫాంహౌస్‌ను కొందరు ఏర్పాటు చేశా రు. స్పష్టంగా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఫౌంహౌస్ ఉన్నా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. అదేవిధంగా శివసాగర్ బఫర్ జోన్‌లోనూ అక్రమంగా లే అవుట్లు వెలిశాయి.. ఇందుకు వికారాబాద్ మున్సిపల్ అధికారులే అనుమతులివ్వడం గమనార్హం. శివసాగర్ చెరువు ఫీడర్ చానెళ్లను పూడూరు మండలం నుంచి వికారాబాద్ మున్సిపాలిటీ వరకు కబ్జాదారులు మింగేశారు. అదేవిధంగా ఒకప్పుడు వ్యవసాయానికి సాగు నీరందించిన సర్పన్‌పల్లి ప్రాజెక్టు ఇప్పుడు అక్రమ వ్యాపారుల దోపిడీకి కల్పతరువైంది.
చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆ చెరువు సమీపంలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అంతేకాకుండా ఆ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా అనేక రిసార్ట్స్ వెలిశాయి. వైల్డర్నెస్ రిసార్ట్స్ నిర్వాహకులైతే ఏకంగా చెరువులోనే దాని కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు ఇరిగేషన్, పంచాయతీ, రెవెన్యూ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. అయితే మూడు నెలల కిందట అనుమతుల్లేవంటూ వైల్డర్నెస్ రిసార్ట్స్‌తోపాటు పలు రిసార్ట్స్‌లను మూ సేసిన అధికారులు.. ముడుపులు అందిన వెంటనే వారే దగ్గరుండి తెరిపించారని ఆరోపణలున్నాయి. ఏకంగా చెరువులోనే నాలుగు ప్రత్యేకంగా రూంలు ఏర్పాటు చేసి అక్రమంగా వ్యాపారం చేస్తున్నా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు గురువారం చెరువులో ఏర్పా టు చేసిన ఒక రూంను సీజ్ చేసి చేతులు దులుపుకొన్నారు. అదేవిధంగా కొంపల్లి చెరువు కూడా ఆక్రమణకు గురైంది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లనూ అక్రమార్కులు చెరపట్టారు.
పరిగి మున్సిపల్లోని కొత్త చెరువు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు నిండుకుండలా కనిపించిన ఈ చెరువు ప్రస్తుతం రికార్డులకే పరిమితమైనది. ఇప్పుడు ఎవరైనా చెరువుండేదని చెప్పినా నమ్మలేని పరిస్థితి నెలకొన్నది. ఆక్రమణలతో పూర్తి గా మాయమైంది. ప్రస్తుతం అక్కడ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. చెరువు మొత్తం ఆక్రమణకు గురైనా ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. చెరువు మూలాల్లేకుండా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పరిగి మున్సిపాలిటీవాసులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాండూరు మున్సిపల్ పరిధిలోని గొల్ల చెరువు ఆక్రమణకు గురైంది. తాండూరు పట్టణానికి అనుకొని ఉన్న ఈ చెరువు కొద్ది కొద్దిగా మొత్తం అన్యాక్రాంతమైనది. అక్కడ అక్రమంగా నిర్మాణాలు వెలిసినా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. అక్కడ ఇండ్ల నిర్మాణానికి మున్సిపల్ అధికారులు అనుతులు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.