రంగారెడ్డి, జూన్ 26(నమస్తే తెలంగాణ) : షాద్‌నగర్‌లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యాపకుల నియామకం సైతం పూర్తయింది. ఈ ఏడాది జూలై 17 నుంచి తరగతులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం కళాశాలను మంజూరు చేయగా.. దీని వెనుక అప్పటి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషి ఉన్నది. కళాశాల నిర్మాణానికి అప్పట్లోనే ప్రభుత్వం రూ.16.49కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది. యువతకు వృత్తి నైపుణ్యం కల్పించేందుకు కేసీఆర్ సంకల్పంతో షాద్ నగర్లో ఏర్పాటైన పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడి యువతకు వరంగా మారనున్నది.
మూడు కోర్సులతో ప్రారంభం..
పాలిటెక్నిక్ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో తాత్కాలికంగా షాద్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులను మొదలు పెడుతున్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ తరగతులను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూడు డిప్లొమా కోర్సుల్లో ప్రతి కోర్సుకు 60 సీట్ల చొప్పున 180 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా డాక్టర్ బిట్ల వేణును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతానికి 10 మంది టీచింగ్ స్టాఫ్‌ను ప్రభుత్వం నియమించింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామక ప్రక్రియను సైతం చేపడుతున్నారు. ప్రస్తుతం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. జూలై 13 నాటికి విద్యార్థులు కళాశాలలో రిపోర్టు చేయనున్నారు. జూలై 17 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు అబ్దుల్లాపూర్‌మెట్, బడంగ్పేట్, మహేశ్వరంలలో ఉండగా.. షాద్‌నగర్‌లో కొత్తగా ఏర్పాటైన కళాశాలతో జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల సంఖ్య నాలుగుకు చేరింది.
విద్యార్థులకు వరం..
షాద్‌నగర్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిరుపేదల విద్యార్థులకు వరంగా మారనున్నది. ఈ ప్రాంతంలో సాంకేతిక విద్య అందుబాటులో లేక విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తున్నది. పదో తరగతి ఉత్తీర్ణులైన తర్వాత పాలిసెట్ ఎంట్రన్స్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు సుదూరంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలకు లేదంటే హైదరాబాద్‌కు వెళ్లి చదువుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. జిల్లాలో గత ఏడెనిమిదేండ్లుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసిన వారికి మంచి డిమాండ్ ఉన్నది. ప్రస్తుతం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతోద్యోగాలు పొందేందుకు ఇక్కడి యువత ఉవ్విళ్లూరుతున్నది.