వికారాబాద్, అక్టోబర్ 21 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, మురళీధర్‌లు పోలీస్ అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పోలీస్ గౌరవ వందనం చేస్తూ అమర వీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు పండుగల పూట కూడా విధి నిర్వహణలో పాల్గొంటారని గుర్తు చేశారు. పోలీస్ వ్యవస్థ ప్రజల ప్రశాంతత కోసం, తమ ప్రశాంతతను కోల్పోయి కూడా సేవలందిస్తున్నందుకు గర్వించాలన్నారు.
దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే ప్రజలు సుఖఃసంతోషాలతో ఉంటారన్నారు. పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న ఇండియా – చైనాకు మధ్య సియాచిన్ అనే ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్నారనే దశలో జరిగిన పోరాటంలో పంజాబ్ పోలీసులు వీరోచితంగా పోరాడి 21 మంది ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏటా పోలీస్‌ల అమరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.
జిల్లాలో పది రోజుల పాటుగా పోలీస్ స్టేషన్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. దేశంలో ప్రజల సంరక్షణ కోసం 1.9.2023 నుంచి 31.8.2024 మధ్య కాలంలో 214 మంది పోలీసులు ప్రాణాలను కోల్పోయారన్నారు. ఎంతో మంది పోలీస్ అధికారులు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ త్యాగాలు చేశారన్నారు. అనంతరం ఏడాది కాలంలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరుల పేర్లను గుర్తుచేసుకొన్నారు. పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వాసు చంద్ర, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు భీమ్‌కుమార్, నవీన్‌కుమార్, ఎస్ఐలు సురేశ్, స్రవంతి, సంతోశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.