తాండూరు, మే 4 : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని తమ వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ జావేద్ తన ఇంట్లో ఉండగా.. పోలీసులు బలవంతంగా బయటకు లాక్కుని వచ్చి మహిళలు అడ్డుకున్నా పట్టించుకోకుండా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.
మరో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఆసిఫ్ మంత్రి తుమ్మల సభాస్థలికి వెళ్లి వివిధ అంశాలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు బలవంతంగా ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈయనను కూడా తీసుకువెళ్లకుండా మహిళలు అడ్డుకున్నా పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదు. అలాగే తాండూరులోని బీఆర్ఎస్ నాయకుడు సంతోష్‌గౌడ్, యాలాల మండల అధ్యక్షుడు రవీందర్‌గౌడ్, బీఆర్ఎస్వీ నాయకులు దత్తాత్రేయ, నర్సింహులు, రుద్రూపాటిల్ తదితరులను తాండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జావేద్ మాట్లాడుతూ.. తాము ఏమైనా ఉగ్రవాదులమా అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టుల పేరిట పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబ మహిళలు పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వచ్చిన సమయంలో భయభ్రాంతులకు లోనయ్యారని, ఇదే సందర్భంలో పోలీసులను అడ్డుకున్నా ఏమాత్రం కరుణించకుండా పోలీస్ వాహనం వరకు ఈడ్చుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరులో పోలీసులు అధికార పార్టీ మెప్పు కోసమే పాకులాడుతున్నారని , ప్రజలకు రక్షణ కల్పించాలన్న ధ్యాసను మర్చిపోతున్నారని ఘాటుగా విమర్శించారు.
తమ వార్డులో అభివృద్ది పనుల గురించి, సమస్యల గురించి మంత్రికి వివరించేందుకు తాను వెళితే పోలీసులు దారుణంగా వ్యవహరించారని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన ఫోన్లు స్వాధీనం చేసుకుని తనను పెద్దేముల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులంటే కాంగ్రెస్ నాయకులకు ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు తాండూరు ప్రజలకు ఈ విషయాల్లో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.