బొంరాస్‌పేట, ఫిబ్రవరి 25 : దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో గ్రామ దేవతలకు నిర్వహించే జాతరలో ఇదే పెద్దది. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతూ, కోరిన కోరికలు తీర్చే దేవతగా ఎల్లమ్మ తల్లి.. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో, షోలాపూర్‌లో భక్తులు ఎల్లమ్మ తల్లిని ఇంటి దేవతగా కొలుస్తుంటారు. జాతరకు తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. జాతరలో ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం మార్చి 1వ తేదీ శుక్రవారం జరుగనున్నది. ఈ సిడెను తిలకించడానికి సుమారు లక్షన్నర మందికి పైగా భక్తులు హాజరవుతారు. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ కమిటీ చైర్మన్ ఏదుల జయరాములు, ఆలయ మేనేజర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు కోస్గి, పరిగి, తాండూరు, నారాయణపేట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. సిడెకు, రథానికి రంగులు వేసి సిద్ధం చేశారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి భక్తులు ఇప్పటికే అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు.
29న పల్లకీ సేవ..
ఈ నెల 29 గురువారం రాత్రి పల్లకీ సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పోలేపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం నుంచి అమ్మవారి ఉత్సవాన్ని పల్లకీలో ఉంచి రాత్రి ఊరేగింపుగా జాతర ప్రాంగణంలోని ప్రధాన దేవాలయానికి తీసుకురావడంతో ఉత్సవాలు అధికారికంగా ప్రారంభమవుతాయి.
మార్చి 1వ తేదీన సిడె..
ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టం మార్చి 1వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించే సిడె.. ప్రత్యేకంగా తయారు చేయించిన రథం పొడవైన కట్టెకు చివరన ఉంచిన తొట్టెలలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి దేవాలయం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయిస్తారు.
2వ తేదీన రథోత్సవం..
మార్చి 2వ తేదీ శనివారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం నిర్వహిస్తారు. పూలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి జాతర మైదానంలో లాగుతారు. 3వ తేదీన ప్రత్యేక పూజలు, 4వ తేదీన పూజల అనంతరం సాయంత్రం అమ్మవారి ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి.
జాతరకు ఏర్పాట్లు పూర్తి..
గురువారం నుంచి ఐదు రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతర మైదానంలో ఉన్న అన్ని తాగునీటి బోర్లు పని చేసేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తున్నాం. జాతర మైదానంలో చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నాం. వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి భక్తులు సహకరించాలి.
– రాజేందర్‌రెడ్డి, ఎల్లమ్మ దేవాలయ మేనేజర్