బొంరాస్పేట, ఫిబ్రవరి 25 : కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ ధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఒకవైపు మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, సవారి నిండిన మహిళలు మరో వైపు నడుస్తుండగా… పదిహేను నిమిషాలపాటు జరిగిన సిడె కార్యక్రమానికి భక్తజనం పులకించిపోయారు. జల్ది కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మేళతాళాలు, కొమ్ము వాయిద్యాలతో పల్లకీలో ఊరేగింపుగా సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లారు. బావిలో విగ్రహానికి స్నానం చేయించి తిరిగి గుడికి చేరుకున్నారు. గుడి ఎదుట కుంభం పోసిన తరువాత ఆలయ చైర్మన్ ముచ్చటి వెంకటేశ్, మేనేజర్ రాజేందర్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించిన రథంలోని తొట్టెలలో ఉంచి ఆలయం చుట్టు ప్రదక్షిణ చేశారు. అమ్మవారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. వేపాకు, పసుపు, గవ్వలు కలిపిన భండారును అమ్మవారిపైకి విసరగా, తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, మహారాష్ట్రలోని షోలాపూర్, భీవండి, గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్ల నుంచి దాదాపుగా రెండు లక్షల మందికి పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. అమ్మవారికి మేకపోతులు, కోడిపుంజులతో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి కోనేరులో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు జాతరలో ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకున్నాయి.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆలయ కమిటీ వారు సన్మానించారు. మండల టీఆర్ఎస్ నాయకులు ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు.