పెద్దేముల్, అక్టోబర్ 28 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్‌పై వెంటనే సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని సోమవారం పలు యువజన సంఘాల నాయకులు, యువకులు పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా.. ఎలాంటి సంఘటనలు జరుగలేదని, ఫిర్యాదులు ఏమీ అందలేదని బదులిచ్చారు. ఉదయం 10.30కి ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి శంకర్ కళాశాలకు చేరుకోగా.. ఆయనను యువజన సంఘాల నాయకులు ప్రశ్నించారు.
తాను విద్యార్థినులతో మాట్లాడి విచారణ చేసి సదరు లెక్చరర్‌పై చర్యలు తీసుకుంటానన్నారు. విద్యార్థినులను విచారించిన అనంతరం లెక్చరర్‌ను వెంటనే సస్పెండ్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డుకు లిఖితపూర్వకంగా సిఫారసు చేసి సస్పెండ్ అయ్యేలా చూస్తానని యువజన సంఘాల నాయకులకు బదులిచ్చారు. దీంతో సంఘం నాయకులు నోడల్ ఆఫీసర్‌పై దురుసుగా ప్రవర్తించడంతో అక్కడే ఉన్న ఎస్ఐ గిరి తన సిబ్బందితో కలిసి భద్రత కల్పించారు.
ఆలోపు అక్కడికి చేరుకున్న పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్, తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపాల్‌ల అసోసియేషన్ మహిళా కార్యదర్శి రజిత అక్కడకు చేరుకొని మాట్లాడుతూ.. లెక్చరర్ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం ముమ్మాటికి తప్పని, ఈ విషయమై ఇంటర్మీడియట్ ఉన్నతాధికారులతో మాట్లాడతామని తెలిపారు. విద్యార్థినులకు అండగా నిలబడినందుకు వారికి ధన్యవాదాలు చెప్పారు. మరోమారు ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసుకుంటామన్నారు.
స్పందించిన నోడల్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో యువజన సంఘాల నాయకులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే లెక్చరర్‌ను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు లెక్చరర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకొని అతడిపై లైంగిక వేధింపుల కేసుతోపాటు, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గిరి తెలిపారు. దర్యాప్తు వేగవంతం చేసినట్లు చెప్పారు.