వికారాబాద్, ఆగస్టు 6, (నమస్తే తెలంగాణ): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం నత్తనడకన సాగుతున్నది. ధరణి స్థానంలో భూ భారతిని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలరోజుల్లో భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రైతులకు మాయ మాటలు చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రెవెన్యూ సదస్సులు పూర్తై నెలరోజులు దాటినా ఇంకా భూ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా కొనసాగుతుండడం గమనార్హం. దరఖాస్తుల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండడంతో ఏదో ఒక కొర్రీ పెట్టి సమస్యను మళ్లీ పెండింగ్‌లో పెట్టేలా రెవెన్యూ అధికారులు చూస్తున్నట్లు అర్జీదారులు ఆరోపిస్తున్నారు.
జూలై 15లోగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన (సాదాబైనామా, కోర్టు కేసుల్లో ఉన్న భూ సమస్యలు మినహా) మిగతా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలుండడంతో తహసీల్దార్లు మొదలుకొని ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్ వరకు అందరూ గత పదిహేను రోజులుగా ఇదే పనిలో ఉన్నారు. ధరణి పోర్టల్‌పై లేనిపోని ఆరోపణలు చేసి భూ భారతిని తీసుకువచ్చిన ప్రభుత్వం.. కేవలం పోర్టల్ పేరు మార్చడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని, భూ సమస్యలను వంద శాతం పరిష్కారం చూపుతామని చెప్పినప్పటికీ వాస్తవానికి మాత్రం భూ సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అదేవిధంగా నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలంటూ ఏడాదిగా రైతులు కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించలేకపోయారు. కలెక్టర్ లాగిన్‌లోనే చాలా వరకు పీవోబీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ సదస్సుల్లోనూ దరఖాస్తు చేసుకున్న రైతులు ఇప్పుడైనా పీవోబీ దరఖాస్తులకు పరిష్కారం చూపుతారో లేదోనని ఎదురుచూస్తున్నారు.
రైతుల ప్రదక్షిణలు..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల పరిష్కారం నత్తనడకన సాగుతుందని రైతుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దరఖాస్తు చేసుకొని నెల రోజులు దాటడంతో తహసీల్దార్ కార్యాలయం మొదలుకొని ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయానికి రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే దరఖాస్తులకు సంబంధించి ప్రస్తుతం నోటీస్ జనరేట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నోటీస్ జనరేట్ చేసిన అనంతరం అన్ని భూ ధృవీకరణ పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకున్న తరువాత తహసీల్దార్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. తదనంతరం ఆర్డీవో లాగిన్‌లో, ఆ తరువాత అదనపు కలెక్టర్, కలెక్టర్ లాగిన్‌లో అప్రూవల్ అయిన తర్వాతనే సంబంధిత దరఖాస్తులు పరిష్కారం అవుతాయి. అయితే వీటిని పరిష్కరించేందుకు మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరో వారం రోజుల్లోగా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా ఏదో ఒక భూ ధృవీకరణ పత్రం లేదంటూ రిజెక్ట్ చేసే దిశగా రెవెన్యూ యంత్రాంగం ముందుకెళ్తుంది. అయితే జిల్లాలోని ఓ మండలంలో 350కిపైగా దరఖాస్తులు వస్తే కేవలం ఐదారింటిని మాత్రమే ఇప్పటివరకు నోటీస్ జనరేట్ చేసినట్లు తెలిసింది. ఏడాదిగా భూ సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ అధికారులు చెప్పిన మ్యాడ్యూల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏదో ఒక కొర్రీ పెడుతూ రిజెక్ట్ చేశారు. భూ సమస్యలున్న సంబంధిత రైతులకు నోటీసులిచ్చిన అధికారులు వారి దగ్గరున్న భూ పత్రాలన్నీ ఇచ్చినా గతంలో మాదిరిగానే రిజెక్ట్ చేసేందుకు రిపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే జిల్లావ్యాప్తంగా 475 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 11,801 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కనీసం 10 శాతం దరఖాస్తులను కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం చూపలేకపోవడం గమనార్హం. ఇప్పటివరకు కేవలం 575 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించారు. మరో 1575 దరఖాస్తులకు సంబంధించి లాగిన్ అయినట్లు, మరో 700 దరఖాస్తులకు సంబంధించి టెక్నికల్ సమస్య ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే 10,944 దరఖాస్తులకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు నోటీస్ జనరేట్ చేశారు.