పరిగి, ఏప్రిల్ 8 : కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న పట్టణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడంతోపాటు స్వచ్ఛమైన గాలి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టగా.. నేడు అవి పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కనీసం వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉన్న కొద్దిపాటి మొక్కలకు కూడా నీరు పోసేవారు కరువయ్యారు. పార్కు ప్రహరీలు కూలినా పట్టించుకునే వారే లేరు. గత కేసీఆర్ ప్రభుత్వం పరిగి పట్టణంలోని కొత్త లేఅవుట్లలో మున్సిపాలిటీకి వదిలిన పార్కు స్థలాల్లో పలు రకాల మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందించింది. మధ్యలో కూర్చొని సేద తీరేందుకు సిమెంట్ బెంచీలనూ ఏర్పాటు చేయించింది.
ప్రత్యేకంగా ట్యాంకర్లతో నీరు పోయించడంతో అప్పట్లో పార్కులు పచ్చదనంతో కనిపించేవి. అయితే, ప్రభుత్వం మారడంతో ఆ పరిస్థితి కూడా మారింది. పరిగి పట్టణంలోని పార్కులను ఎవరూ పట్టించుకోవడం లేదు. మైత్రినగర్‌లో ఏర్పాటుచేసిన పార్కులో రెండు పర్యాయాలు మొక్కలు నాటినా అవి కనిపించడం లేదు. అదేవిధంగా తిరుమల వెం చర్లో ఉన్న పార్కులోని మొక్కలన్నీ ఎండిపోయాయి. పార్కుగోడ కూలిపోయినా పట్టించుకునే వారే లేరు. ఆ ఖాళీ స్థలంలో పైపుల చుట్ట లు వేశారు.
గాన్సలో పాఠశాల సమీపంలోని పార్కులో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించకపోవడంతో లోపలికి వెళ్లి వాకింగ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలో వాటర్ ట్యాంకర్ ఉన్నా మొక్కలకు నీరు పోసేందుకు వినియోగించకపోవడం గమనార్హం. అసలు అధికారులకు పార్కుల సంరక్షణ ఆలోచన లేద నే విమర్శలున్నాయి. పాలకవర్గ కాలపరిమితి పూర్తి కావడంతో అదనపు కలెక్టర్ ఇక్కడ ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారు. పచ్చదనం కోసం ఏర్పాటు చేసిన పార్కులు ఖాళీ మైదానా లుగా మారుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని పార్కులను పచ్చదనానికి నిలయాలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.