షాద్నగర్టౌన్, ఫిబ్రవరి 9: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అందరిని భాగస్వాములను చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ గీతారాధిక అన్నారు. బుధవారం షాద్నగర్ మున్సిపాలిటీలోని పట్టణ నర్సరీ, పట్టణ ప్రకృతి వనాలను మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డితో కలిసి పరిశీలించారు. నర్సరీల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో నాటే మొక్కలకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ కనీసం 6మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టణ ప్రకృతి, నర్సరీ, మున్సిపాలిటీలోని పరిగిరోడ్డులోని డివైడర్ మధ్యలో నాటిన మొక్కలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేసినట్లు కమిషనర్ తెలిపారు.