కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేస్తాం. ఇంకా సేకరించాల్సిన భూములను తీసుకోకుండా చూస్తాం. సేకరించిన భూమిని అవసరమైతే రైతులకు తిరిగి అప్పగిస్తాం.. అని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఫార్మా బాధిత గ్రామాల రైతులు, ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ పార్టీ నాయకులు అనేక మంది ఫార్మా బాధిత గ్రామాల్లో పాదయాత్రలు సైతం చేశారు. పాదయాత్రల ద్వారా ప్రజలను కలుసుకున్నారు. ఫార్మా ఏర్పాటు చేస్తే జరిగే అనర్థాలపై వారికి వివరించారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)
నిరాశే మిగిలింది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఫార్మాసిటీ రద్దవుతుందని తమ భూములు తమ వద్దే ఉంటాయని నమ్మిన బాధిత గ్రామాల ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. ప్రభుత్వం ఫార్మా ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయడంలేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసి తమ పేర్ల మీదకు మార్చాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. మరోవైపు పర్యావరణ పరిరక్షకురాలు ఆవుల సరస్వతి ఫార్మాసిటీని ఏర్పాటు చేయవద్దని, భూములివ్వకుండా నిరాకరించిన రైతుల భూములు తీసుకోవద్దని ఆమె ఆధ్వర్యంలో బాధిత గ్రామాల్లో పర్యటించి చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు.
భూములపై నిషేధాన్ని ఎత్తివేయాలి
ఫార్మాసిటీ ఏర్పాటుకు యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద, తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి గ్రామాల్లో అనేక మంది రైతులు తమ పట్టా భూములివ్వడానికి నిరాకరించారు. ఎట్టి పరిస్థితిల్లోనూ తమ భూములిచ్చేది లేదని మొండికేయడంతో అప్పటి ప్రభుత్వం వారి భూములను తీసుకోలేదు. పైగా భూములకు పరిహారాన్ని పెంచుతామని ప్రకటించినా రైతులు ససేమిరా అన్నారు. ఆ తర్వాత భూములివ్వని రైతుల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితాలోకి చేర్చింది. ఈ నిషేధిత జాబితాలో మేడిపల్లిలో 483 ఎకరాలు, నానక్‌నగర్‌లో 154, తాటిపర్తిలో 382, కుర్మిద్దలో 974ఎకరాలు పట్టా భూములున్నాయి.
ఆ భూములకు సంబంధించిన పరిహారాన్ని కూడా కోర్టులో జమ చేశారు. సుమారు 1,500 నుంచి 2,000 మంది రైతులు పట్టా భూములు కలిగి ఉన్నారు. తమ భూములివ్వనందుకు వాటిని నిషేధిత జాబితాలో పెట్టడం సమంజసం కాదని పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే తమ భూములు తమ కొస్తాయని, ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు కాదని నమ్మిన రైతులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జైకొట్టి భారీ మెజార్టీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు మొహం చాటేయడంతో పాటు తమ భూములపై నోరు మెదపడంలేదని రైతులు వాపోతున్నారు. వెంటనే తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరుతున్నారు.
పాదయాత్ర చేసిన వారందరికీ పదవులు..
ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి ఫార్మా బాధిత గ్రామాల్లో పాదయాత్రలు జరిపిన నాయకులందరికీ ప్రస్తుతం పదవులు దక్కాయి. పదవులు పొందిన తర్వాత వారు తమ వైపు కన్నెత్తి చూడడంలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. సెప్టెంబర్ 19, 2020లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన నాయకులు ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ప్రసుత్తం వీరంతా రాష్ట్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే యాచారం ప్రాంతానికి చెందిన కోదండరెడ్డి కూడా గతంలో ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రైతు సంఘం చైర్మన్‌గా ఉన్నారు. కోదండరాం కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ఫార్మాకు వ్యతిరేకంగా అనేక సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఫార్మా బాధిత గ్రామాల్లో ప లుమార్లు పర్యటించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఫార్మాసిటి వద్దు.. వ్యవసాయమే ముద్దు
యాచారం : మండలంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం ర్యాలీ చేపట్టారు. ఫార్మా వద్దంటూ వ్యవసాయమే ముద్దంటూ నినాదాలు చేశారు. ఫార్మాసిటి ఏర్పాటుతో కలిగే అనర్థాలపై ప్రజలకు, రైతులకు వివరించారు. ఇటీవలే రైతులు పటాన్చెరు, గడ్డపొతారం, పాశమైలారం, కిష్టయ్యపల్లి, బొల్లారం గ్రామాల్లో ఏర్పాటైన ఫార్మా కంపెనీలపై బస్సు యాత్ర ద్వారా నాయకులు, రైతులు అధ్యయనం చేశారు. అనంతరం గ్రామస్తులకు ఫొటోల రూపంలో అవగాహన కల్పించారు. భూ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం ఏర్పడి మానవ మనుగడ కష్టంగా మారుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం యాచారం మండలంలో ఫార్మాసిటీని రద్దు చేయాలని కోరారు. ఫార్మాకు భూములివ్వని రైతుల పేర్లు ఆన్లైన్లో ఎక్కించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ఫార్మాను రద్దు చేసేదాకా పోరాడుతామని వారు పేర్కొన్నారు.పోలీసుల అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించొద్దని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ సీఐ కృష్ణంరాజు, ఎస్ఐ తేజంరెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులకు సర్దిచెప్పారు. శాంతియుతంగా ఫార్మా రద్దు కోసం పోరాడుతామని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్తలు కవుల సరస్వతి, సామ నిరంజన్, కానమోని గణేశ్, కుందారపు సత్యనారాయణ, మహిపాల్‌రెడ్డి, దేవోజీ, వినోద్‌రెడ్డి, అనసూయ స్పష్టం చేశారు.