రైతులను మభ్యపెట్టి మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఫార్మాసిటీ పేరుతో రైతుల భూములను లాక్కొంటూ వారికి బతుకుదెరువు లేకుండా చేస్తున్నది. పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను వేడుకున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్మాకు భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెబుతుండడంతో 600 మంది రైతులకు నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
దీంతో శనివారం ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధితులు ట్రాక్టర్లు, ఆటోలలో కలెక్టరేట్‌కు చేరుకుని ప్రధాన గేటు ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లింకు రోడ్ల ద్వారా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని అన్నదాతలు ముక్తకంఠంతో నినదించారు.
ప్రభుత్వం వెంటనే తమ భూములను తిరిగి తమ పేర్లపై ఆన్లైన్లో ఎక్కించాలన్న నినాదాలు హోరెత్తాయి. ఎన్నికలకు ముందు ఒక మాట.. గద్దెనెక్కాక మరో మాట మాట్లాడుతూ రైతులకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 2,200 ఎకరాల పట్టా భూములను తిరిగి రైతుల పేరిట మార్చాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఏవో సునీల్‌కు బాధిత రైతులు వినతిపత్రాన్ని అందజేశారు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ)/యాచారం
కొన్నేండ్లుగా ఈ భూములను నమ్ముకునే జీవిస్తున్నాం. ఆ భూములే జీవ నాధారం. కానీ, ప్రభుత్వం తమకు తెలియకుండా భూములను లాక్కొని ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని చూడడం దారుణం. ఆ భూములు లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పట్టా భూములను మా పేర్లపై ఆన్లైన్లో మార్పించాలి.
– పార్వతమ్మ, నక్కర్త
మేడిపల్లిలో ఉన్న పట్టా భూమిని తమకు తెలియకుండా ప్రభుత్వం పేరు తో ఆన్లైన్లో మార్పిడి చేశారు. దీంతో ఆ భూములన్నీ ప్రస్తుతం నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. తమ పట్టా భూములను బలవంతంగా లాక్కోవడం ఎంతవరకు సమంజసం. మా పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతుబంధు, పంట రుణాలు రావడంలేదు.
– మల్లయ్య, మేడిపల్లి