పరిగి, అక్టోబర్ 28 : విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కృషిచేస్తున్నట్లు తపస్ పరిగి మండల అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా అన్నారు. సోమవారం పరిగి తహసీల్దార్‌కు ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సీకమిటీ రిపోర్టును త్వరగా తీసుకొని అమలు చేయాలని అన్నారు. పెండింగ్ బిల్లులను అన్నింటినీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో తపస్ సంఘం జిల్లా బాధ్యులు లక్ష్మణ్, చంద్రమౌళి, బుచ్చిలింగం, మండల బాధ్యులు కృష్ణ, ప్రవీణ్, చంద్రశేఖర్, కరుణాకర్, రాకేశ్, జల్లి శ్రీనివాస్, వీణ, మంజూల, అఖిల తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెండింగ్ నాలుగు డీఏ లు చెల్లింపు, పీఆర్సీ అమలు వంటి సమస్యలపై రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న నాలుగు దశల ఉద్యమ కార్యా చరణలో భాగంగా సోమవారం వికారాబాద్ మండల తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తపస్ మండల అధ్యక్షుడు రాఘవేందర్ గుప్తా మాట్లాడుతూ ఐదు డీఏలు పెండింగ్‌లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒకటి మాత్రమే ప్రకటించడం చాలా అన్యాయమన్నారు. వేతనాలపై ఆధారపడి జీవించే ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయంగా రావలసిన డీఏ ల కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మిగతా పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటించాలన్నారు. పీఆర్సీ నివేదిక తెప్పించుకొని రాష్ట్రంలో రెండో పీఆర్సీని 50% ఫిట్మెంట్తో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండల ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్, సరెండర్ లీవ్ మెడికల్ బిల్లులను, మార్చి-24 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యా యులకు వారికి రావాల్సిన అన్ని రకాల బకాయిలు గ్రాట్యుటీ , సంపాదిత సెలవులను నగదు రూపంలో వెంటనే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు కొత్తగడి అంజిరెడ్డి, తపస్ రాష్ట్ర బాధ్యులు జాక వెంకటేశం, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ కుమార్, సంగమేశ్వర్, హన్మయ్య, మండల మహిళా కార్యదర్శి అనురాధ, ఉపాధ్యాయులు బస్వరాజు, అంజిరెడ్డి, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
పెద్దేముల్: ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు న్యాయంగా రావాల్సిన డీఏ బకా యిలను, పీఆర్సీ, ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మండల అధ్యక్షుడు రాజేశ్, ప్రధాన కార్యదర్శి జె.సంతోష్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఈ మేరకు సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ కె.కిషన్‌కు సంఘ సభ్యులు, ఉపాధ్యాయులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడిచినా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు ఎలాంటి ఆర్థికపరమైన ప్రయోజనం కలుగ లేదని, కమిటీల పేరుతో, రిపోర్టుల పేరుతో కాలయాపన చేస్తుం దన్నారు.
మార్కెట్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు న్యాయం రావాల్సిన నాలుగు డీఏ బకాయిలను, ఈ-కుబేర్‌లో ఉన్న పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, అదే విధంగా పీఆర్సీ కమిటీ రిపోర్టు తెప్పించుకొని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను వచ్చే నెల 22 వరకు పరిష్కరించాలని లేని యెడల 23 న హైదరాబాద్ పట్టణంలో ధర్మాగ్రహ దీక్షను పెద్ద ఎత్తున చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్, ఆనందం, వడిచర్ల సత్యం, వెంకటయ్య, జయశ్రీ, కవిత, శంకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.