ఏడాది కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ జిల్లా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తానన్న హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే జిల్లావాసులకు మొండిచేయి చూపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్స్ తదితర సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలపాలిట ఆపద్బాంధవుడయ్యాడు. కేసీఆర్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతులు నేడు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. ఏడాదిలోనే అప్పుల పాలయ్యామని జిల్లా రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నది.
కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు తీస్తాయని జిల్లావాసులు సంబురపడ్డారు. కానీ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు నిధుల వరద, సాగునీరిచ్చే ప్రాజెక్టును చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల అభివృద్ధిని విస్మరించడంతోపాటు సాగునీరందించే పాలమూరు-ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారు. నాడు ‘పల్లెప్రగతి’తో అవార్డులు దక్కించుకున్న గ్రామాలు నేడు అస్తవ్యస్తమయ్యాయి. పల్లెలకు నిధులు లేక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. తాండూరులోని జిల్లా ఆసుపత్రితోపాటు పలు ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉన్నది. జిల్లాకు మణిహారంగా మారనున్న మొబిలిటీ వ్యాలీకి రేవంత్ సర్కార్ మోకాలాడ్డుతుండడం విశేషం.
– వికారాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
దామగుండంలో రాడార్ పిడుగు..
పరిగి నియోజకవర్గం దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి పూడూరు మండల పరిసర గ్రామాల ప్రజలపై కాంగ్రెస్ సర్కార్ పిడుగు వేసింది. దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు, పర్యావరణవేత్తలు, అటవీ ప్రేమికులు ఉద్యమిస్తూ వస్తున్నారు. ప్రజాసంఘాలు, మేధావులు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు స్వచ్ఛందంగా తరలివచ్చి సేవ్ దామగుడం పేరిట నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మూసీ, ఈసీ నదులకు పుట్టినిల్లు అయిన దామగుండాన్ని రక్షించుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని, రాడార్ ఏర్పాటును విరమించుకోవాలని ఉద్యమిస్తున్నారు.
ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించిన స్థానిక ప్రజాప్రతినిధులే దగ్గరుండి భూమి పూజ చేయించడంపై స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రంతో మూసీ నది ప్రమాదంలో పడనున్నదని పర్యావరణవేత్తలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే నీటి ఊటలు మాయమవుతాయని, భూగర్భజలాలు ఎండిపోనున్నాయని, మూసీకి నీళ్లు రావడం కష్టమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నదిని ఆదిలోనే అంతం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ పనులు చేపడుతామనడం విడ్డూరంగా ఉన్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 300 రకాల పక్షి జాతులు రేడియేషన్ ప్రభావంతో అంతరించిపోనున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.
నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాలు ఆపాలి..
దేశ రక్షణ పేరుతో దామగుండం అడవిలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ నిర్మాణ పనులను ఆపాలి. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అభివృద్ధి పేరిట ప్రజలను మోసం చేస్తుండ్రు. దామగుండం అటవీ ప్రాంతంలో వేసవిలోనూ చల్లటి వాతావరణం ఉంటుంది. నేవీ రాడార్ వల్ల వాతావరణంలో మార్పు వస్తుంది. నేవీ రాడార్‌ను మరోచోటుకు తరలించాలి. ప్రభుత్వం విరమించుకోకుంటే ఆందోళనను ఉధృతం చేస్తాం.
– బీ మహేశ్‌కుమార్, పూడూరు మండల కేంద్రం
నేవీ రాడార్ వల్ల దైవదర్శనం కష్టమే..
నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పురాతనమైన దామగుండం రామలింగేశ్వరస్వామి దైవ దర్శనం ఇక కష్టమే. ప్రతి ఉగాదికి వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ ప్రాంతంలోని అటవీ భూములను ఇవ్వబోమని కేంద్రప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదు.
– చన్గోముల్ సుజాత, పూడూరు మండల కేంద్రం
ఏడాది పాలన.. నరక యాతన..
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొడంగల్‌లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆది నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు మాకొద్దంటూ రైతులు భగ్గుమన్నారు. ఒప్పుకోకుండా ప్రభుత్వం భూములు లాక్కొని కంపెనీలను ఏర్పాటు చేస్తుందని మాట్లాడిన దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిపై రైతులంతా తిరగబడి దాడి చేస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పారిపోయిన పరిస్థితి నెలకొన్నది. అతడిని కాపాడేందుకు పోలీస్ బెటాలియనే దిగివచ్చిందంటే ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకించారో అర్థం చేసుకోవచ్చు. కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు వస్తే బతుకులు ఆగమవుతాయని, ముంబై, దుబాయ్ వలస వెళ్లాల్సి వస్తదని వాపోయారు.
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర, రోడ్లపై ధర్నాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా పోలీసులతో రైతులను అరెస్ట్ చేయించడం, మహిళలపై అసభ్యకరంగా దాడికి పాల్పడేలా చేసింది. చేసిందంతా ప్రభుత్వమే చేయించి.. ఘటనకు బాధ్యులంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితోపాటు 28 మంది రైతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫార్మాకు భూములిచ్చేది లేదని రైతులు తేల్చిచెప్పడంతో కంపెనీల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని చెప్పి మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తామంటూ రైతులకు ఊపిరాడకుండా చేసింది. ఏదిఏమైనా భూములివ్వబోమని రైతులు తెగేసి చెబుతుండడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
ప్రాణాలు అర చేతిలో.. వాహనాలు గాల్లో..
తాండూరు-వికారాబాద్ రోడ్డు గుంతలమయం. ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వాహనాలు నడుపుతున్నం. వాహనాలు గాల్లో ఎగురుతూ సర్కస్ ఫీట్లు చేస్తున్నట్లుగా ఉన్నది. రోడ్ల మరమ్మతుల జాడ లేదు. రాత్రిళ్లు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతున్నది. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతున్నది. ప్రయాణికులు ఎంత మొర పెట్టుకున్నా సర్కారుకు చీమకుట్టినట్లయినా లేదు.
– రాము సాయిరాం, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇందిరానగర్, తాండూరు
తాండూరులో కుంటుపడిన అభివృద్ధి..
తాండూరు నియోజకవర్గంలో ఏడాదిలోనే అభివృద్ధి కుంటుపడింది. మనోహర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన తాండూరు ప్రజలకు ఇప్పటివరకూ చేసిందేమీ లేదు. నియోజకవర్గమంతటా రోడ్లు అధ్వానంగా మారాయి. కనీసం రోడ్ల మరమ్మతులకు కూడా నిధులు తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని విమర్శలు మూటగట్టుకున్నారు. ఏడాదిలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా, ఇచ్చిన హామీలనూ అమలు చేయకపోవడంతో ఎమ్మెల్యే ఎక్కడికెళ్లినా ప్రజలు అడ్డుకుని గట్టిగానే నిలదీస్తున్నారు. ఏడాదిలో నాలుగైదు సార్లు ప్రజలు అడ్డుకోగా, చేసేదేమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏడాది విజయోత్సవాలు పేరిట చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ ఎమ్మెల్యేలు జనాల్లోకి పోతే దాడులు ఖాయమని గుర్తించి ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు రెండు రోజులు క్రితం మంజూరు చేసి నిధులిచ్చామంటూ డబ్బా కొడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేపిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంజూరైన ఇండస్ట్రియల్ ఎస్టేట్, నర్సింగ్ కాలేజ్ తదితర పనులను నిలిపివేసి అభివృద్ధిని విస్మరిస్తున్నారు.
అభివృద్ధి పనులకు పాతర..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి పాతరేసింది. 11 నెలలుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇంతవరకు ఒక్క పనీ చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే కనిపిస్తున్నయ్. కాంగ్రెస్ సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటున్నది. తప్పుల తడకగా రుణమాఫీ, ఊసేలేని రైతుభరోసా, రైతు బీమా జాడలేదు. గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్ల పెంపు అన్ని సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ఇప్పటికీ అతీగతి లేదు. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో ఉన్నది.
– సుశీల్ కుమార్ గౌడ్(రాజూ గౌడ్), గ్రంథాలయ సంస్థ వికారాబాద్ జిల్లా మాజీ చైర్మన్
బాగు చేస్తాడని ఓటేస్తే.. బాధ పెడుతుండు..
ఓటేసి గెలిపించి ఎమ్మెల్యేను చేస్తేనే సీఎం అయ్యిండు.. మా ప్రాంతానికి బాగుచేస్తడనుకున్నం.. కానీ, మమ్మల్ని బాధ పెడుతడని అనుకోలే.. సదువులేదు, ఉద్యోగం చేయలేము. ఈ కంపెనీలతో భూములు పోతయని అంటుండ్రు. అవే పోతే మా బతుకు ఎట్టా.. ఏం చేసి బతకాలి. అందుకే భూములు ఇవ్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేయొద్దు..? మా పొలాలు మాకే కావాలె..
– హర్యానాయక్, లగచర్ల, దుద్యాల మండలం
తిండి తినలేక పోతున్నం..
మా ఇంట్లో వాళ్లు పట్టణాలకు వెళ్లి కూలి పని చేస్తుండ్రు. నేను నా మనుమళ్లు, మనుమరాళ్లు ఇంటికాడ ఉంటున్నం. ఉన్న పొలంలో పంట పండిస్తూ.. మేకలు, పశువులను మేపుకొంటూ బతుకుతున్నం. ఇప్పుడు భూములు పోతయన్న బాధతో తిండి తినలేకపోతున్నం. నిద్ర పట్టడం లేదు. ఇక్కడ కంపెనీలు కడితే బతికేది కష్టమంటుండ్రు. మాకేమో ఏం తెల్వదు. ఎవుసం ఒక్కటే తెలుసు. మా భూముల జోలికి రావొద్దని వేడుకుంటున్నా.
– ముత్యాలీబాయి, రోటిబండ తండా, దుద్యాల మండలం
అటకెక్కిన అనంతగిరి ఎకో టూరిజం..
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నా.. టూరిజం అభివృద్ధి అంశం అటకెక్కింది. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. సొంత నియోజకవర్గంపై ప్రేమను చూపిస్తూ…మిగతా నియోజకవర్గాలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తుండడంపై జిల్లా ప్రజానీకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అనంతగిరి ఎకో టూరిజంపై బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఎన్నికల సమయంలో అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు పట్టించుకోకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గంలోనే అనంతగిరి హిల్స్ ఉన్నప్పటికీ ఆయన కూడా పట్టించుకోకపోవడం బాధాకరం.
ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలి..
వికారాబాద్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన అనంతగిరిని టూరిజంగా అభివృద్ది చేయాలి. వికారాబాద్ సమీపంలో ఉన్న అనంతగిరికి నిత్యం పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. త్వరగా టూరిజం ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధితో పాటు, ప్రాంతం అభివృద్ది చెందుతుంది. అనంతగిరి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి. టూరిజం కోసం ఏర్పాటు చేసిన నిధులతో వెంటనే పనులు ప్రారంభించాలి.
– కే శ్రీనివాస్, వీడీఎఫ్ అధ్యక్షుడు, తెలంగాణ జేఏసీ జిల్లా అధ్యక్షుడు
అనంతగిరిలో టూరిజం అభివృద్ధి చేయాలి..
అనంతపద్మనాభస్వామి దేవాలయం, చుట్టూ ఎత్తైన కొండలు.. ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఆయా పట్టణాల నుంచి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్యలో పెరుగుతున్నా.. కాంగ్రెస్ సర్కార్ కనీస సౌకర్యాలను కల్పించడం లేదు. అనంతగిరిని టూరిజంగా అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్నో ఏండ్లుగా అనంతగిరిని టూరిజం చేయాలని ఆ ప్రాంత ప్రజల కోరిక.
– ఎం.నాగయ్య, ట్రాస్మా రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్